ఓ మహిళా అనుమానస్పద స్థితితో మృతిచెందింది. అయితే ఆ మరుసటి రోజే పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.
బెంగళూరు: కర్ణాటకలో ఓ మహిళా అనుమానస్పద స్థితితో మృతిచెందింది. అయితే ఆ మరుసటి రోజే పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన దక్షిణ బెంగళూరులోని బేగూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. చింతామణికి చెందిన శిల్పకు 2022 జూలైలో బాగేపల్లికి చెందిన ఎస్‌వీ రమేష్‌తో వివాహం జరిగింది. రమేష్ బేగూర్ పోలీస్ స్టేషన్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే శిల్ప శనివారం తెల్లవారుజామున దక్షిణ బెంగళూరులోని బేగూర్‌లోని పటేల్ లేఅవుట్‌లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని కనిపించింది.
దీంతో శిల్ప కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శిల్ప మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె భర్త రమేష్‌ను అరెస్ట్ చేశారు.
అయితే శిల్ప, రమేష్‌లు దాదాపు 10 ఏళ్ల క్రితం డీఈడీ కోర్సు చేస్తున్న సమయంలో తొలిసారిగా పరిచమయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికే రొమాంటిక్ రిలేషన్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత రమేష్‌కి పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత సబ్ ఇన్‌స్పెక్టర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. శిల్పా ఉన్నత విద్యను అభ్యసించేందుకు బెంగళూరు వెళ్లింది. అయితే వీరు సన్నిహితంగా మెలిగినప్పటికీ.. శిల్పను పెళ్లి చేసుకునేందుకు రమేష్ ఇష్టపడలేదని ఆమె తండ్రి వెంకటరాయప్ప పోలీసులకు తెలిపారు. రమేష్ చివరికి కోర్టు వివాహానికి అంగీకరించాడని.. గత సంవత్సరం జూలైలో పెళ్లి జరిగిందని చెప్పాడు.
శిల్పకు ఎక్కువ కట్నం ఇవ్వాలని.. లేకుంటేవారి కులంలోని మహిళనే పెళ్లి చేసుకుంటానని రమేష్ తరచూ డిమాండ్ చేసేవాడని వెంకటరాయప్ప తెలిపాడు. రమేశ్ అన్నయ్య శ్రీనివాస్.. శిల్ప కులం గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని.. అతడికి వారి కులంలోని మహిళతో పెళ్లి చేస్తామని బెదిరించాడని వెంకటరాయప్ప పోలీసులకు చెప్పాడు. అయితే పెళ్లి చేసుకున్న కొంతకాలానికే రమేష్ ఒంటరిగా జీవించడంతో.. దంపతుల మధ్య బంధం మరింత దెబ్బతింది.
ఇక, శిల్ప మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శిల్ప ఆత్మహత్య చేసుకున్న సమయంలో తాను పనికి దూరంగా ఉన్నానని రమేష్ పేర్కొన్నాడు. ప్రస్తుతానికి అతనిపై హత్య, వరకట్న వేధింపులు, క్రిమినల్ బెదిరింపులతో పాటు ఐపీసీలోని ఇతర నేరాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
