ముగ్గురు అక్కాచెల్లెళ్ల పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. ఆ ముగ్గురు మహిళల శరీరంపై నుంచి దుస్తులు తొలగించి... దారుణంగా కొట్టారు. వారిలో ఒకరు గర్భవతి కాగా.... ఆమె పట్ల కూడా కనీసం కనికరం చూపకపోవడం విషాదకరం. వీరిలో ఆ గర్భిణీ స్త్రీకి గర్భస్రావం అవ్వడం గమనార్హం. ఈ సంఘటన అస్సాం రాష్ట్రం దర్రాంగ్ జిల్లాలోని సిపాఝూర్ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఇరు కుటుంబాల మధ్య గొడవలే ఈ దారుణానికి ప్రధాన కారణం. ఓ కుటుంబం...  మరో కుటుంబంపై ఫిర్యాదు చేసింది.  దర్రాంగ్ జిల్లాకు చెందిన ఓ యువకుడు వేరే మతానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా సదరు యువతితో కలిసి లేచిపోయాడు. దీంతో... తమ కూతురిని కిడ్నాప్ చేశారంటూ సదరు యువతి కుటుంబసభ్యులు ఆ యువకుడి ఫ్యామిలీపై ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు.. యువకుడి  ముగ్గురు అక్కాచెల్లెళ్లను, వారిలో వివాహితైన ఓ స్త్రీ భర్తను పోలీసులు అరెస్టు చేసి దారుణంగా కొట్టారు. వివస్త్రలను చేసి మరీ కొట్టడం గమనార్హం. గర్భవతి అని కూడా చూడకుండా దాడి చేశారు. వారి దాటికి తట్టుకోలేక ఆ గర్భిణీ స్త్రీ కి అబార్షన్ అయ్యింది.   స్త్రీల పట్ల అంత దారుణంగా పోలీసులు ప్రవర్తించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యింది.

ఆ స్త్రీలపై దాడి చేసిన వారిలో ఓ మహిళా పోలీసు కూడా ఉండటం గమనార్హం. ఈ వివాదం పెద్దది కావడంతో... సదరు మహిళా పోలీసుని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.