Asianet News TeluguAsianet News Telugu

కొడుకు కోసం ఆ పోలీసు గాలింపు.. టెర్రరిజంలో చేరి పోలీసుల చేతిలోనే హతమైన కుమారుడు.. ఆ బ్రైట్ స్టూడెంట్ కథ ఇదీ

జమ్ము కశ్మీర్‌లో ఓ పోలీసు కొడుకు కనిపించకుండా పోయాడు. 12వ తరగతిలో 88 శాతం మార్కులు సంపాదించుకున్న ఆ బాలుడు రిజల్ట్ కూడా చూడకుండా టెర్రరిస్టులతో కలిశాడు. ఏడు నెలలపాటు నిర్విరామంగా వెతికిన తండ్రికి ఈ బుధవారం చేదు వార్త వినాల్సి వచ్చింది. సోపోర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆ పోలీసు కొడుకు హతమయ్యాడు.
 

police son encountered after he turned into terrorism.. father seven months search went in vain
Author
First Published Sep 2, 2022, 7:33 PM IST

న్యూఢిల్లీ: ఆ తల్లిదండ్రులు కొడుకును చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్నారు. దినదినం ప్రయోజకుడు అవుతున్నాడు. చదువుల్లోనూ మంచి ప్రతిభ చూపిస్తున్నాడు. వారు నివసించే జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాద బెడద ఎక్కువ ఉన్నప్పటికీ వేరే రాజకీయాల వైపు తొంగి చూడలేదు. తండ్రి పోలీసు కావడంతో కొడుకు ఇండియన్ ఆర్మీలో చేరి మేజర్‌గా ఎదగాలని అనుకున్నాడు. అందుకోసం తపించాడు. చదువుల్లోనూ రాణించాడు. కానీ, ఆ బాలుడు ఎలా దారితప్పాడో తెలియదు. కానీ, ఉగ్రవాదం ఉచ్చులో పడిపోయాడు. ఇంటి నుంచి చెప్పా పెట్టకుండా టెర్రరిస్టులతో చేరాడు. 

17 ఏళ్ల కైజర్ ఫిబ్రవరిలో కనిపించకుండా పోయాడు. అప్పటికే ఆయన 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్ రాశాడు. ఫలితాలు ఇంకా వెలువడనే లేదు. కానీ, ఇంటిలో చెప్పా పెట్టకుండా ఎవరికీ తెలియకుండా కనిపించకుండా పోయాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను తీసుకెళ్లిపోయారు. జమ్ము కశ్మీర్ పుల్వామా జిల్లా తుజ్జన్ గ్రామానికి చెందినవాడు కైజర్.

కొడుకు కచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవుతాడని పంచిపెట్టడానికి ఆ తల్లి స్వీట్లు తెచ్చింది. ఫలితాలు వచ్చాయి. కైజర్ 88 శాతం మార్కులు సాధించాడు. కానీ, కొడుకు కానరాలేదు. స్వయంగా పోలీసు అయిన తండ్రి కొడుకు కోసం తీవ్రంగా గాలించాడు. నెలలపాటు ఆయన కనిపించకుండా పోవడంతో బహుశా టెర్రరిస్టుల్లో చేరాడనే అనుమానాలు వారిలోనూ వచ్చాయి.

గత ఏడు నెలలుగా తండ్రి, పోలీసు మొహమ్మద్ అష్రఫ్ దర్ ఎంతో వెతికాడు. తల్లి స్వీట్లు ఇంట్లో పెట్టుకుని కొడుకు కోసం ఎదురుచూస్తూనే ఉన్నది.

‘ఆర్మీలో మేజర్ కావాలని అనుకుంటున్నట్టు నా కొడుకు నాకు చెప్పాడు. కానీ, డాక్టర్ కావాలని నేను చెప్పాను. నా కొడుకు ప్యాషన్ మాత్రం ఆర్మీలో చేయాలనే’ అని కన్నీళ్లు నిండుకుంటుండగా కైజర్ తల్లి నసీమా బేగమ్ చెప్పింది.

ఆర్మీలో సేవలు అందిద్దామనుకున్న కైజర్ పూర్తి విరుద్ధంగా పోలీసుల చేతిలో ఒక టెర్రరిస్టుగా హతం అయ్యాడు.

బుధవారం ఆ తల్లిదండ్రుల గుండె పగిలే వార్త విన్నారు. ఉత్తర కశ్మీర్ సోపోర్‌లో ఓ ఎన్‌కౌంటర్ జరిగిందని, ఆ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లోకల్ టెర్రరిస్టులను మట్టుబెట్టినట్టు వివరించారు. ఆ తర్వాత ఆ ఇద్దరిలో ఒకడు కైజర్ ఉన్నాడని ఆ తల్లిదండ్రులకు పోలీసులు తెలిపారు.

కైజర్ అంత్యక్రియలకు దర్ కుటుంబం నుంచి ఆరుగురు హాజరుకావడానికి అధికారులు అనుమతించారు. కుప్వారాలో తుజ్జన్ గ్రామానికి 150 కిలోమీటర్ల దూరంలో గుర్తు తెలియని ప్రదేశంలో సమాధి చేశారు. ఆ తల్లిదండ్రుల గుండె కోత వర్ణనాతీతం.

రెండేళ్లుగా జమ్ము కశ్మీర్ పోలీసులు టెర్రరిస్టుల డెడ్ బాడీలను కుటుంబాలకు అందించడం లేదు. వారి ఇళ్లకు దూరంగా ఎవరికీ తెలియని ప్రదేశంలో ఆ టెర్రరిస్టుల డెడ్ బాడీలకు అంత్యక్రియలు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios