ఢిల్లీలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా చోటు చేసుకున్న మత పరమైన ఘర్షణలో ప్రమేయం ఉందని అనుమానిస్తూ పోలీసులు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ కు బుల్లెట్ గాయం చేసిన వ్యక్తి కూడా ఉన్నారు. ఢిల్లీలో ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని పోలీసులు ప్రకటించారు.
ఢిల్లీలో శనివారం సాయంత్రం హనుమాన్ జయంతి ఊరేగింపులో ఘర్షణ చోటు చేసుకుంది. ఓ వర్గం ఈ ర్యాలీపై రాళ్లు రువ్వింది. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది పోలీసులకు గాయాలు అయ్యాయి. మరో పౌరుడు కూడా గాయపడ్డారు. అయితే ఈ ఘటనకు కారణమైన వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మతపరమైన హింసలో ప్రమేయం ఉన్న 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ మత ఘర్షణలో ఓ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ మేధలాల్ మీనా చేతికి బుల్లెట్ గాయమైంది. అయితే ఈ బుల్లెట్ పేల్చిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి పేరు అస్లాం అని గుర్తించారు. నిందితుడి నుంచి పిస్టల్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ అరెస్టుల విషయంలో డీసీపీ (నార్త్‌వెస్ట్) ఉషా రంగాని మీడియాతో మాట్లాడారు. జహంగీర్‌పురి హింసాకాండ కేసులో ఇప్పటివరకు 14 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ హింసాకాండలో 8 మంది పోలీసులు, ఒక పౌరుడుతో పాటు మొత్తంగా 9 మంది గాయపడ్డారని డీసీపీ చెప్పారు. బుల్లెట్ గాయామైన సబ్‌ఇన్‌స్పెక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ మెమోరియల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.
అంతకు ముందు జహంగీర్‌పురి ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం కుశాల్ చౌక్‌లో డీసీపీ ఉషా రంగాని ఆధ్వర్యంలో అమన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభ్యులందరూ తమ తమ ప్రాంతాల్లోని ప్రజలు శాంతి, సామరస్యాన్ని కాపాడేందుకు కృషి చేయాలని కోరారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ హింసాకాండను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఖండించారు. ఈ ఘటన వెనుక బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమని ఆయన చెప్పారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థానాతో కలిసి పరిస్థితిని సమీక్షించిన బైజల్ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో పుకార్లు, తప్పుడు వార్తలను పట్టించుకోవద్దని, అల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థానా పౌరులను కోరారు. పరిస్థితి అదుపులోనే ఉందని ట్వీట్ చేశారు. జహంగీర్‌పురి, ఇతర సున్నిత ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని మోహరించారు.
ఢిల్లీలోని జహంగీర్‌పురిలో ఊరేగింపుపై రాళ్లదాడి ఘటన తీవ్ర ఖండనీయమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలంతా పరస్పరం చేయి పట్టుకుని శాంతిభద్రతలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. శాంతి లేకుండా దేశం అభివృద్ధి చెందదని, ప్రజలందరూ శాంతి భద్రతలు కాపాడాలని సూచించారు. దర్యాప్తు సంస్థలు, పోలీసులు కేంద్రంతో ఉన్నారని, కాబట్టి శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు.
ఇదిలా ఉండగా జహంగీర్‌పురి హింసాకాండపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థానా, దీపేంద్ర పాఠక్‌లతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ ద్వారా మాట్లాడారు. శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. రాళ్ల దాడి తర్వాత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను షా ఆదేశించారు. కాగా ఈ దాడిలో ప్రమేయం ఉన్న వారిని పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ సెల్ సహా పలు బృందాలు నిమగ్నమై ఉన్నాయి. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు భారీగా పోలీసు బలగాలతో పాటు పారామిలటరీ బలగాలను రంగంలోకి దించారు. మీరట్, లక్నో, నోయిడాలలో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు ఉత్తరప్రదేశ్‌లో హై అలర్ట్ ప్రకటించారు.
