పట్టపగలు.. నడి రోడ్డుపై ఓ యువతి కిడ్నాప్ కి గురైంది. రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని దుండగులు బలవంతంగా కారులోకి లాక్కెళ్లి మరీ కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన కోలారు నగరంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కాగా.. యువతి కిడ్నాప్ ఘటన స్థానిక సీసీకెమేరాలో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో  నగరంలోని ఎంబి రోడ్డులో ఇద్దరు యువతులు నడుచుకుని వెళుతున్నారు. ఇదే సమయంలో ఎదురుగా ఇన్నోవా కారులో వచ్చిన కోలారు నగరంలోని దేవాంగపేటకు చెందిన శివు (23)  అనే యువకుడు యువతి(21)ని కారులో కిడ్నాప్‌ చేసుకుని వెళ్లాడు. 

యువతి పక్కనే ఉన్న ఆమె సోదరి కిడ్నాప్‌ను అడ్డుకోవాలని ప్రయత్నించినా ఫలించలేదు. తమ ప్రేమను యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదనే కోపంతో శివు ఈ కిడ్నాప్‌కి పాల్పడినట్లు భావిస్తున్నారు. యువతి సోదరి గల్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో శివుపై ఫిర్యాదు చేయగా పోలీసులు యువతి కోసం గాలింపు చేపట్టారు. ఆచూకీ తెలిసిందని, త్వరలోనే తీసుకువస్తామని పోలీసులు అంటున్నారు.