ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అతను చెప్పిన మాటలను సదరు బాలిక నిజమని నమ్మేసింది. అతనికి సర్వస్వం అర్పించింది. తీరా అతని కారణంగా బాలిక గర్భం దాల్చింది. అబార్షన్ కూడా చేయించాడు. ఇలా యువతి చాలా సార్లు గర్భం దాల్చినా.. ప్రతిసారీ అబార్షన్ చేయించాడు. ఇలా కాదని.. పెళ్లి చేసుకోవాలని బాలిక పట్టుపట్టడంతో.. పరారయ్యాడు. ఈ సంఘటన జార్ఖండ్‌ రాష్ట్రంలోని లోహర్‌దగా జిల్లాలో చోటు చేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే...  లోహర్‌దగా జిల్లా కురుబ్లాక్‌కు చెందిన ఓ బాలిక చదువు నిమిత్తం అమ్మమ్మగారి ఊరైనా సెన్హా ఏరియాలో నివాసం ఉంటోంది. ఇదే ప్రాంతలో శివరాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన యువకుడు  అజిత్‌ కూడా నివాసముంటున్నాడు. చదువు విషయంలో సహాయం చేసే క్రమంలో వీరిద్దరికి స్నేహం ఏర్పడింది. కాలక్రమంలో ఆ స్నేహం కాస్త క్రమంగా ప్రేమగా మారింది. 

పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిపై అజిత్‌ గత రెండేళ్లుగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో పలుమార్లు అబార్షన్‌ కూడా చేయించాడు. కాగా, ఇటీవల బాలిక మరోసారి గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలని అజిత్‌ని పట్టుబట్టింది. పెళ్లికి నిరాకరించిన అజిత్‌.. అక్కడి నుంచి పరారయ్యాడు.

దీంతో మోసపోయానని తెలుసుకున్న బాలిక సెన్హా పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడు పరారిలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకొని విచారణ చేస్తామని పేర్కొన్నారు.