పెళ్లైన విషయాన్ని దాచి మళ్లీ పెళ్లి.. మూడో భార్యకు తెలియడంతో..!
రమ్యకు మరోసారి వివాహం జరిపించాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. ఓ మ్యాట్రీమోనీ వెబ్ సైట్ ద్వారా తిరుపత్తూర్ జిల్లాకు చెందిన వినోద్‌కుమార్ తో వివాహం జరిపించారు.

ఓ వ్యక్తికి ఆల్రెడీ రెండు సార్లు వివాహం అయ్యింది. అయితే, ఆ విషయాన్ని దాచి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అందుకుగాను, కట్నం కింద నగదు, నగలు కూడా తీసుకున్నాడు. అయితే, మోసపోయినట్లు గుర్తించిన మహిళ పోలీసులను ఆశ్రయించింది.
ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళితే, తిరుపతి జిల్లా నాగలాపురానికి చెందిన రమ్య(38) కు 2007లో చెన్నైకి చెందిన కుమారస్వామితో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె కూడా ఉంది అయితే, 2020లో కుమారస్వామి అనారోగ్యంతో కన్నుమూశాడు. దీంతో, రమ్యకు మరోసారి వివాహం జరిపించాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. ఓ మ్యాట్రీమోనీ వెబ్ సైట్ ద్వారా తిరుపత్తూర్ జిల్లాకు చెందిన వినోద్‌కుమార్ తో వివాహం జరిపించారు.
అనంతరం ఆ దంపతులు అరియూర్ ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. వివాహ సమయంలో రమ్య తల్లిదండ్రులు 50 సవర్ల నగలు, 4 కిలోల వెండి వస్తువులు ఇచ్చారు. వాటిని స్వాహా చేసిన వినోద్‌కుమార్.. అనంతరం రమ్యకు చెందిన కారు, ద్విచక్రవాహనం, స్థలాన్ని తన పేర రాయించుకుని మోసం చేశాడు. అతని ప్రవర్తనతో అనుమానం వచ్చి, అతని గురించి ఆరా తీయగా, అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడని తెలిసింది. దీంతో, మోసపోయినట్లు గుర్తించిన ఆ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.