Gurugram: రద్దీగా ఉండే గురుగ్రామ్ వీధిలో నగ్నంగా ప‌రుగులు పెట్టిన ఒక విదేశీయుడిని స్థానికులు ప‌ట్టుకుని చెట్టుకు కట్టేశారు. న‌డిరోడ్డుపై నగ్నంగా తిరుగుతున్న అత‌న్ని గురుగ్రామ్ పోలీసులు అదుపులోకి తీసుకునీ, దీనిపై విచార‌ణ జ‌రుపుతున్నారు. 

Foreign national runs naked on road in Gurugram: ఎప్పుడూ ర‌ద్దీగా ఉండే రోడ్డుపై ఒక వ్య‌క్తి న‌గ్నంగా ప‌రుగులు పెట్టాడు. ఈ క్ర‌మంలోనే భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చివ‌ర‌కు ఒక వీధిగుండా ప‌రుగులు పెడుతుంటే స్థానికులు ప‌ట్టుకుని అత‌న్ని చెట్టుకు క‌ట్టేశారు. స‌మాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచార‌ణ జరుపుతున్నారు. ఈ షాకింగ్ ఘ‌ట‌న గురుగ్రామ్ లో చోటుచేసుకుంది. 

వివ‌రాల్లోకెళ్తే.. నగ్నంగా రోడ్డుపై పరిగెత్తుతున్న ఓ విదేశీయుడిని గురుగ్రామ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నైజీరియా జాతీయుడిగా అనుమానిస్తున్న వ్యక్తిని వైద్య పరీక్షల నిమిత్తం సెక్టార్ 10లోని సివిల్ ఆస్పత్రికి తరలించారు.

బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో సెక్టార్ 69లోని తులిప్ చౌక్ సమీపంలో రోడ్డు మధ్యలో నగ్నంగా పరిగెత్తుతూ కనిపించడంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు అక్కడికి చేరుకోగానే అతను మ‌రో వీధివైపు పరిగెత్తాడు, అక్కడ స్థానికులు అతన్ని పట్టుకుని చెట్టుకు కట్టేశారు.

అనంత‌రం పోలీసులకు స‌మాచారం ఇవ్వ‌డంతో వారు అత‌న్ని అదుపులోకి తీస‌కున్నారు. అయితే, నిందితుడు ఇలా చేయ‌డానికి గ‌ల కార‌ణాల‌పై విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని పోలీసులు తెలిపారు. అత‌ని ఆరోగ్య స్థితిని తెలుసుకోవ‌డానికి ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్టు పేర్కొన్నారు. అతని మానసిక స్థితి నిలకడగా ఉంటే కేసు నమోదు చేస్తామని బాద్షాపూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇన్‌స్పెక్టర్ మదన్ లాల్ తెలిపారు.