వాళ్లంతా ఓ దోపిడీ దొంగల ముఠా. దారిలో కనిపించిన వారి నుంచి బంగారం, నగదు దోచుకొని అక్కడి నుంచి పరారౌతూ ఉంటారు. అయితే.. ఈ దోపిడీ దొంగలు.. కొందరు అమాయకపు యువకులను అతి కిరాతకంగా హత్య చేశారు.  ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాణిపేట జిల్లా సిప్కాట్‌ హౌసింగ్‌ బోర్డు పంప్‌ హౌస్‌ ప్రాంతంలో గత 16వ తేదీ అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులను సిప్‌కాట్‌ పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా వారిలో ఒకరు పారిపోయాడు. మరో ముగ్గురి పట్టుబడ్డారు. 

ఆ యువకులు.. రాణిపేట చిక్కరాజపురం మోట్టూరు బజన ఆలయ వీధికి చెందిన యువరాజ్‌ (26), పల్లవ నగర్‌ కన్నికోవిల్‌ వీధికి చెందిన వాసు (19), తిరువలం బస్టాండ్‌ ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంటుకు చెందిన అరవిందన్‌ (19)గా గుర్తించారు.

వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో.. పోలీసులు వారిని తమదైన శైలిలో ప్రశ్నించారు. ఈ దర్యాప్తులో ఆ యువకులు వారు చేసిన నేరాల చిట్టా మొత్తం విప్పేశారు.

తాము ఓ మహిళ వద్ద రూ.లక్ష బంగారం చోరీ చేశామని.. మరో ముగ్గురు యువకులను నరికి హత్య చేశామని వారు అంగీకరించారు. వారిని చంపిన తర్వాత సమీపంలోని ఓ నదిలో ఖననం చేసినట్లు అంగీకరించారు. అయితే ఆ స్థలం వేలూరు జిల్లా సెంబరాజపురంలోని రెవిన్యూ శాఖ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వీఏఓ జోతీశ్వరన్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరువలం పోలీసులు ముగ్గురిని రిమాండ్‌కు తరలించాలని నిర్ణయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఐదుగురి కోసం గాలిస్తున్నారు.