కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ పేరు చెబితేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈ వైరస్ సోకకుండా ఉండేందుకు ఏం చేయాలని చెప్పినా.. ప్రజలు గుడ్డిగా నమ్మేస్తున్నారు. 

Also read ఇక్కడ లాక్ డౌన్ వర్తించదు: బీజేపీ ఎమ్మెల్యే గ్రాండ్ బర్త్ డే దావత్!...

ఆ వైరస్ పై ప్రజల్లో ఉన్న భయాన్ని కొందరు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. దీనికి మందు కనిపెట్టామంటూ.. బజారులో పెట్టి అమ్మేస్తున్నారు. జనాలు కూడా నిజమని నమ్మి కొనేస్తున్నారు. అలా ప్రజలను బురిడీ కొట్టిస్తున్న వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.

కాంచీపురం జిల్లాలో ‘కరోనా’ వైర్‌సకు మందు అంటూ విక్రయాలు చేపట్టిన ఒడిశా వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేలా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్‌ బజారు వీధిలో శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి ‘కరోనాకు మందు’ అంటూ విక్రయాలు ప్రారంభించారు.

 కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు ఈ మందును కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆయనది ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇంద్రజిత్‌ మండల్‌ అని, మాంబాక్కం ప్రాంతంలో పాన్‌ షాపు నిర్వహిస్తున్నాడని తేలింది.

 జలుబు, దగ్గు నివారణకు వినియోగించే మందులను పొడి చేసి పేపర్లో ఉంచి కరోనా మందంటూ విక్రయిస్తున్నాడని విచారణలో తేలడంతో పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు. ప్రపంచంలో ఇప్పటివరకు కరోనాను మందు లేదని, ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయని, ఇలాంటి వదంతులను ప్రజలు నమ్మరాదని ఆరోగ్యశాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.