ఒకరికి తెలీకుండా మరికొరిని ఇలా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. విదేశాల్లో ఉద్యోగం అని చెప్పి భారీ మొత్తంలో డబ్బు గుంజాడు. చివరకు అతని గుట్టుని ఫేస్ బుక్ బయటపెట్టింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  తమిళనాడు కి చెందిన అమానుల్లా భాష చాలా సంవత్సరాల క్రితం దుబాయ్ లో ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డాడు.  అక్కడ విలాసవంత జీవితానికి అలవాటుపడ్డాడు. ఈ క్రమంలోనే డబ్బు సులభంగా ఎలా సంపాదించాలా అని ఆలోచించి పెళ్లిళ్లను మార్గం చేసుకున్నాడు. 

అందులో భాగంగా బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువతులను ఒకరికి తెలియకుండా ఒకరిని వివాహం చేసుకున్నాడు. అమ్మాయిల తల్లితండ్రుల నుంచి కట్నం ఇతర లాంఛనాలు అందగానే ఏదోఒక సాకుతో దుబయ్‌ వెళ్లిపోయేవాడు.

ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం బెంగళూరుకు వచ్చిన నిందితుడు ఇదేనెల 23వ తేదీన కేజీ హళ్లికి చెందిన యువతితో నాలుగవ వివాహం చేసుకున్నాడు. నాలుగవ పెళ్లికి సంబంధించి ఫోటోలను ఫేస్‌బుక్‌ ఖాతాలో అప్‌లోడ్‌ చేశాడు.

నిందితుడు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసిన ఫోటోలను గమనించిన మొదటి ముగ్గురు భార్యలు నాలుగవ వివాహం చేసుకున్న యువతికి, తల్లితండ్రులకు విషయాన్ని తెలియజేయడంతో నిందితుడు బండారం బట్టబయలైంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కేజీ హళ్లి పోలీసులు నిందితుడు అమానుల్లా బాషతో పాటు నిందితుడికి సహకరించిన తండ్రి జాకిర్‌ హుసేన్‌ను అరెస్ట్‌ చేశారు.