అతను చదివింది పీయూసీ. కానీ అందరికీ మాత్రం తాను సాఫ్ట్ వేర్ ఉద్యోగినని నమ్మిస్తూ వస్తున్నాడు. తాను లండన్ లో ఉద్యోగం చేస్తున్నానని.. లక్షల్లో జీతమని చెప్పి అమ్మాయిలకు వల వేస్తాడు. ఇప్పటి వరకు చాలా మంది అమ్మాయిలను మోసం చేయగా.. తాజాగా ఓ ఉపాధ్యాయురాలిని కూడా ఇదే విధంగా మోసం చేశాడు. ఆమెను శారీరంగా వాడుకొని.. ఆర్థికంగా దోచుకున్నాడు. చివరకు ఆమె ఫిర్యాదుతో అతని మెసాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అతని పేరు జో అబ్రహాం మాథ్యూస్ గా పోలీసులు గుర్తించారు. అతను కేరళ వాసి గా.. బెంగళూరులో ఉపాధ్యాయురాలిని మోసం చేశాడు. దర్యాప్తులో అతని పాపాల చిట్టా అంతా బయటపడింది. 

బెంగళూరులో ఓ మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించి గత 9 ఏళ్లు పాటు సహజీవనం చేసి రూ.45 లక్షలు సొమ్ము కాజేసినట్లు తెలిసింది. అతనిపై బాధితురాలు బెంగళూరులో కేసు పెట్టింది. అంతకు ముందే ఓ టీచర్‌కు కూడా ఇలాగే రూ.38 లక్షలు టోపీ వేశాడు. కోరమంగల నివాసి అయిన నిందితుడు (35)ని గత వారం అత్యాచారం కేసులో నగర పోలీసులు అరెస్ట్‌ చేశారు.  

ఇతనికి పెళ్లయి బెంగళూరులో ఉంటున్నాడు. కానీ అవివాహితున్నని, లండన్‌లో ఉన్నట్లు నమ్మించి పలువురు మహిళలను వివాహం చేసుకుంటానని లైంగికంగా వాడుకుని డబ్బులు, ఆస్తులు కొట్టేయడంతో ఆరితేరాడు.

తన పేరు మార్చి ఇప్పటి వరకు చాలా మంది మహిళలను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. చాలా మందిని శారీరకంగా కూడా వాడుకున్నట్లు తెలిసింది. పెళ్లి చేసుకోమంటే మాయ మాటలు చెప్పి తప్పించుకునేవాడని బాధితులు తెలిపారు. తాను ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమంటే.. నగ్న చిత్రాలు చూపించి బెదిరించేవాడన వాపోయారు. కాగా.. నిందితుడి వద్ద నుంచి డబ్బు వసూలు చేసి బాధితుల్లో ఒకరైన ఉపాధ్యాయురాలికి ఇప్పించినట్లు పోలీసులు చెప్పారు. ఇతని జాబితాలో ఇంకా చాలా మంది మహిళలు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.