నలుగురు యువకులు సినిమా పిచ్చిలో భాగంగా తమకు రౌడీల్లా గుర్తింపు రావాలనే ఆశతో బీభత్సం సృష్టించారు. అమాయకులపై కత్తులతో దాడి చేశారు.


ఈ మధ్యకాలంలో అందరికీ సినిమా పిచ్చి బాగా పడుతోంది. దాని కోసం వింత వింత ప్రయత్నాలు చేస్తారు. తాజాగా.. నలుగురు యువకులు సినిమా పిచ్చిలో భాగంగా తమకు రౌడీల్లా గుర్తింపు రావాలనే ఆశతో బీభత్సం సృష్టించారు. అమాయకులపై కత్తులతో దాడి చేశారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 తిరువళ్లూరు జిల్లా తిరువేళాంగాడు యూనియన్‌ రాజ్‌పద్మనాభపురం గ్రామానికి చెందిన వినోద్‌(36), విజయకుమార్‌(41). ఇద్దరూ ఊత్తుకోటలోని ప్రయివేటు కంపెనీలో హెచ్‌ఆర్‌ మేనేజర్లు. వీరు విధులు ముగించుకుని బుధవారం రాత్రి బైక్‌లో ఇంటికి బయలుదేరారు.


తిరువళ్లూరు సమీపంలోని కలియనూర్‌ వద్ద వెళుతుండగా నలుగురు యువకులు వారిని అడ్డగించి బైకులు లాక్కుని వారిపై కత్తులతో దాడి చేసి కలియనూర్‌ గ్రామానికి వెళ్లి కత్తులతో హల్‌చల్‌ చేసారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రాణాప్రాయస్థితిలో పడి వున్న బాధితులను చెన్నై ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 

పోలీసుల విచారణలో కలియనూర్‌ గ్రామానికి చెందిన సూర్య(21), ఏకాటూరు గ్రామానికి చెందిన సునాల్‌(24), పాక్కుపేట గ్రామానికి చెందిన సతీష్‌(19), కడంబత్తూరు చెందిన భాగవత్‌(25)గా గుర్తించారు. విచారణలో తమకు సినిమా పిచ్చి ఎక్కువగా వుండడంతో సినిమాల్లో రౌడీలుగా రాణించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. పోలీసులు నలుగురిని అరెస్ట్‌ చేశారు.