Asianet News TeluguAsianet News Telugu

విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. శివశంకర్ బాబా అరెస్ట్

ఈ విషయం ఇటీవలే ఆ స్కూలు పూర్వ విద్యార్థినుల ద్వారా వెలుగులోకి వచ్చింది. మహాబలిపురం మహిళా పోలీసుస్టేషన్‌ పోలీసులు శివశంకర్‌బాబా సహా ఆరుగురికి పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

police arrest the baba who molested school children
Author
Hyderabad, First Published Jun 17, 2021, 9:24 AM IST

విద్యార్థునులపై లైంగిక వేధింపులకు పాల్పడి.. తప్పించుకు తిరుగుతున్న వివాదాస్పద స్వామిజీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. చెన్నై కేలంబాక్కంలోని సుశీల్‌హరి ఇంటర్‌నేషనల్‌ స్కూలు నిర్వాహకుడు శివశంకర్‌ బాబాను(71) ఢిల్లీ సమీపంలో సీబీసీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. 

చెంగల్పట్టు జిల్లా కేలంబాక్కంలో పదేళ్లకు ముందు శివశంకర్‌ బాబా తనను వేంకటేశ్వరస్వామిగా ప్రకటించుకున్నాడు.  ఆ తర్వాత సుశీల్‌ హరి ఇంటర్నేషనల్‌ స్కూలును స్థాపించాడు. గత కొన్నేళ్లుగా ఆ స్కూలులో చదువుతున్న విద్యార్థినులపై శివశంకర్‌బాబా, ఆయన శిష్యులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. 

ఈ విషయం ఇటీవలే ఆ స్కూలు పూర్వ విద్యార్థినుల ద్వారా వెలుగులోకి వచ్చింది. మహాబలిపురం మహిళా పోలీసుస్టేషన్‌ పోలీసులు శివశంకర్‌బాబా సహా ఆరుగురికి పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి బదిలీ చేసింది. 

సీబీసీఐడీ పోలీసులు రంగంలోకి దిగి శివశంకర్‌ బాబా ఆచూకీకోసం తీవ్రంగా గాలించారు. శివశంకర్‌బాబా డెహ్రాడూన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని మంగళవారం పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీనితో ప్రత్యేకదళం పోలీసులు హుటాహుటిన విమానంలో బయల్దేరి డెహ్రాడూన్‌ చేరుకున్నారు. పోలీసులు తనను  అరెస్టు చేయడానికి వస్తున్నట్టు తెలుసుకున్న శివశంకర్‌ బాబా ఆస్పత్రి నుండి చెప్పాపెట్టక పారిపోయాడు. 

ప్రత్యేక దళం పోలీసులు ఆయన ఆచూకీ కోసం నలువైపులా వాహనాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ సమీపంలో శివశంకర్‌ బాబా దాగి వున్నట్టు తెలుసుకుని సీబీసీఐడీ పోలీసులు స్థానిక పోలీసులకు ఆ విషయాన్ని తెలిపారు. ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగా శివశంకర్‌ బాబాను నిర్బంధించి సీబీసీఐడీ పోలీసులకు అప్పగించారు. సీబీసీఐడీ పోలీసులు బుధవారం రాత్రి లేదా గురువారం ఉదయం శివశంకర్‌ బాబాను చెన్నైకి తీసుకువస్తారని తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios