తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానంటూ తృణముల్ కాంగ్రెస్ ఎంపీ  డెరెక్ ఓ బ్రెయిన్ అన్నారు. రాజ్యసభలో బుధవారం పోక్సో చట్టం బిల్లులపై చర్చ సందర్భంగా తనకు ఎదురైన సంఘటనను ఆయన వివరించారు. ఈ మధ్యకాలంలో చిన్నారులపై లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా... వాటిని అరికట్టేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. చిన్నారులపై దారుణంగా లైంగిక  దాడులకు పాల్పడే వారికి మరణ శిక్ష విధించేలా పోక్సో బిల్లును అమలు చేయాలని భావిస్తున్నారు. దీనికి మద్దతు పలికిన ఎంపీ డెరెక్... తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించారు.

తనకు 13ఏళ్ల వయసులో లైంగిక దాడికి గురైనట్లు ఎంపీ చెప్పారు. కోల్ కతాలో టెన్నిస్ ప్రాక్టీస్ కి వెళ్లి తిరిగివస్తున్నానని... ఆ సమయంలో తాను నిక్కర్, టీషర్ట్ వేసుకొని ఉన్నానని చెప్పారు. అప్పుడు తాను రద్దీ ఎక్కువగా ఉన్న బస్సు ఎక్కానని.. ఆ సమయంలో ఎవరో తనను లైంగిక వేధించారని ఆయన చెప్పారు. కొన్ని సంవత్సరాల తర్వాత  ఈ విషయాన్ని తాను తన ఇంట్లో చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇక ఈ పోక్సో బిల్లు విషయానికి వస్తే..పిల్లలపై తీవ్రమైన లైంగిక నేరాలకు మరణ శిక్ష, మైనర్లపై లైంగిక  నేరాలకు ఇతర తీవ్రస్థాయి శిక్షలకు అవకాశం కల్పించేలా ఈ బిల్లులో ప్రతిపాదనలున్నాయి. చర్చకు సమాధానమిస్తూ పోక్సో సంబంధిత 1.66 కోట్ల పెండింగ్‌ కేసుల విచారణకు 1023 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.