కరోనా సెకండ్‌వేవ్‌‌తో ఇప్పటికే భారత దేశం అతలాకుతలమవుతున్న వేళ ప్రధానమంత్రి సాంకేతిక సలహాదారుడు డాక్టర్ కే విజయ రాఘవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ తప్పదంటూ బాంబు పేల్చారు.

వేవ్‌ ఎప్పుడొస్తుంది ? ఎలా వస్తుందో స్పష్టత లేనప్పటికీ ముప్పు మాత్రం తప్పదని రాఘవన్ హెచ్చరించారు. థర్డ్‌ వేవ్‌ నాటికి వైరస్‌‌లో మరిన్ని మార్పులు చోటు చేసుకోవచ్చని... ఇదే కాకుండా భవిష్యత్‌లో మరిన్ని వేవ్‌లు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

కొత్త స్ట్రెయిన్‌ను ఎదుర్కొనేలా వ్యాక్సిన్‌ తయారు చేసుకోవాలని దేశంలోని ఫార్మా సంస్థలకు విజయ రాఘవన్‌ సూచించారు. అయితే ప్రస్తుత వేరియంట్లపై వ్యాక్సిన్‌ బాగా పని చేస్తోందని ఆయన కితాబిచ్చారు.

Also Read:కోవిడ్ థర్డ్ వేవ్ హెచ్చరికలు.. ‘‘ పీఎంవో సైకోలు’’ వద్దంటూ సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

దేశంలో కరోనా అంతానికి, కొత్త రకం వైరస్‌లను ఎదుర్కోనేందుకు టీకాల పరిశోధనలను మరింత పెంచాల్సిన అవసరం ఉందని విజయరాఘవన్ సూచించారు. వైరస్‌లను ఎదుర్కొనేందుకు పలు మార్పులు, కఠిన ఆంక్షలు, మార్గదర్శకాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. 

మరోవైపు భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన వారం రోజులుగా 3 లక్షలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. బుధవారం నాటి గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3.82 లక్షల మందికి పాజిటివ్‌గా తేలింది.

ఒక్క రోజుకు చనిపోతున్న సంఖ్య రికార్డు స్థాయిలో 3,780కి పెరిగింది. ప్రపంచ కేసులలో 46 శాతం భారత్ వాటా ఉందని, గత వారంలో ప్రపంచ మరణాలలో నాలుగింట ఒక వంతుగా ఉందని డబ్ల్యూహెచ్‌ఓ  తెలిపిన సంగతి తెలిసిందే.