విమర్శకుల ప్రశంసలు అందుకున్న జై భీమ్ సినిమాపై తమిళనాడుకులోని పీఎంకే పార్టీ విరుచుకుపడుతున్నది. ఈ సినిమా నిర్మించి నటించిన సూర్యపై దాడి చేయాలని ఏకంగా ఆ పార్టీ నేత ఒకరు రివార్డు ప్రకటించారు. ఆయనపై దాడి చేస్తే రూ. 1 లక్షల రివార్డు ఇస్తానని ప్రకటించారు. పోలీసులు అప్రమత్తమై ఆయనపై కేసు నమోదు చేశారు. సూర్య నివాసానికి భద్రత కల్పించారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో జాతీయ అవార్డు దర్శకుడు వెట్రిమారన్ సినిమా యూనిట్‌కు మద్దతు తెలిపారు. 

చెన్నై: దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన చిత్రం Jai Bheemపై Tamil Naduకు చెందిన పాటలీ మక్కల్ కచ్చి(PMK) కొన్ని అభ్యంతరాలు లేవనెత్తింది. కొన్ని రోజులుగా ఈ చిత్రంపై విమర్శలు చేస్తున్నది. తాజాగా, ఆ పార్టీ నేత ఏకంగా ఈ చిత్ర కథానాయకుడు, నిర్మాత Suriyaపై దాడికి ఉసిగొల్పాడు. సూర్యపై దాడి చేసిన వారికి రూ. 1 లక్ష Reward ఇస్తానని ప్రకటించాడు. ఈ ప్రకటన రాష్ట్రంలో కలకలం రేపింది. వెంటనే పోలీసులు సదరు నేతపై ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

గిరిజనులు, అణగారిన వర్గాల గురించి జై భీమ్ ప్రధానంగా చర్చించింది. ప్రముఖ న్యాయవాది, మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు వాదించిన ఓ కేసు ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే, ఇందులో వన్నియర్ కమ్యూనిటీని తప్పుగా చిత్రించారనే ఆరోపణలు ఇటీవలే ఎదురయ్యాయి. వన్నియర్ కమ్యూనిటీనే కాదు.. తమ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసేలా ఇందులో చిత్రించారని పాటలీ మక్కల్ కచ్చి పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే పీఎంకే జై భీమ్ సినిమాపై విమర్శల తీవ్రత పెంచింది. సూర్య మయిలదుతురైకి వచ్చినప్పుడు ఆయనపై దాడి చేసిన వారికి రూ. 1 లక్ష రివార్డు అందిస్తామని పీఎంకే నేత ఏ పళనిసామి ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాతే పీఎంకే క్యాడర్ అరాచకం సృష్టించానికి ఉపక్రమించింది. జై భీమ్ సినిమా నడుస్తున్న థియేటర్లపై దాడులకు దిగారు. చాలా చోట్ల వీరంగం సృష్టించారు. 

Also Read: హైదరాబాద్‌లో మరో జైభీమ్.. బంగారం దొంగిలించాడని కేసు.. వేధింపులతో ఆత్మహత్య.. కోర్టుకెక్కిన భార్య

టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సూర్య, ఆయన సతీమణి జ్యోతిక నిర్మించారు. అమెజాన్ ఓటీటీలో ఈ సినిమా విడుదలైంది. జై భీమ్ సినిమాకు సినీ ప్రపంచం నుంచి సామాజిక కార్యకర్తల నుంచి విమర్శకుల వరకూ అనేక ప్రశంసలు వచ్చాయి. కానీ, వన్నియర్ కమ్యూనిటీ అంశమే ఇప్పుడు కలకలం రేపుతున్నది. అయితే, ఈ వివాదాన్ని సద్దుమణిగించడానికి యాక్టర్ సూర్య సమాధానం చెప్పారు. అధికారంపై ప్రశ్నలు లేవనెత్తడం, గిరిజనులు రోజువారీగా ఎదుర్కొనే సమస్యలను ప్రధానంగా చూపెట్టే లక్ష్యంతోనే ఈ సినిమా నిర్మించామని సూర్య వివరించారు. ఈ సినిమా ద్వారా తాము అధికారంపై ప్రశ్నలు లేవనెత్తామని, కాబట్టి, దీన్ని దయచేసి రాజకీయం చేయవద్దని కోరారు.

రిటైర్డ్ జస్టిస్ చంద్రు వాదించిన ఓ కేసే.. జై భీమ్ కాన్సెప్ట్ అని వివరించారు. న్యాయం చేయడానికి ఆయన అధికారంపైనా పోరాడారని, ఆ లీగల్ పోరాటాన్నే సినిమాలో ప్రధానంగా చూపెట్టామని, అదే తమ లక్ష్యమని తెలిపారు. వీటితోపాటు గిరిజనులు రోజువారీగా ఎదుర్కొనే అనేక సమస్యలు, వారి జీవితాల్లోని లోటుపాట్లనూ చిత్రించామని చెప్పారు. 

Also Read: Jai Bhim: హాలీవుడ్ రికార్డులకు పాతరేసిన సూర్య 'జై భీమ్'

జాతీయ అవార్డు పొందిన దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్ వెట్రిమారన్ కూడా ఈ సినిమాను ప్రశంసించారు. ఈ వివాదం రాజుకుంటున్న తరుణంలో మంగళవారం సాయంత్రం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అలాంటి బాధితుల వేదనను బయటి ప్రపంచానికి తెలియజేయాలనే జ్ఞానవేల్ శ్రమ ప్రశంసనీయమని, తెరపైనా, తెర వెనుకా ఇలాంటి వారికి సామాజిక న్యాయం జరగడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించే సూర్య తీరు ఎంతో మందికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. స్తబ్దుగా యథాతథ స్థితినే కొనసాగుతున్న సమాజంలో మార్పును వ్యతిరేకించే వారందరికీ ఈ సినమా ఆగ్రహం తెప్పించడం సహజమేనని వివరించారు. కాగా, ఇలాంటి బెదిరింపుల నేపథ్యంలోనే సూర్య నివాసానికి పోలీసులు భద్రత కల్పించారు.