21వ శతాబ్దం భారతదేశ రైతులకు ఈ నూతన వ్యవసాయ బిల్లులు అవసరమని వ్యాఖ్యానించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ వ్యవసాయ బిల్లులపై ప్రజల్లో, ముఖ్యంగా రైతుల్లో అనవసర ఆందోళను సృష్టిస్తున్నారని విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ. 

భారత దేశ రైతులకు ఈ శతాబ్దం అవసరాలకు తగ్గట్టుగా ముందుకు దూసుకెళ్లాలంటే ఈ బిల్లులు అత్యవసరమని ప్రధాని వ్యాఖ్యానించారు. తమ గుత్తాధిపత్యం కోల్పోతామేమో అని భయపడి ప్రతిపక్షాలు ఈ అనవసరపు భయాలను రేకెత్తిస్తున్నారని ప్రధాని ప్రతిపక్షాలను దుయ్యబట్టారు. 

చట్టం రాగానే ప్రతి ఒక్కరికి ప్రశ్నలు లేవనెత్తుతున్నారని, మండీలు ఏమైపోతాయని గళమెత్తుతున్నారని......... కానీ వాటికేమి కావు అని, అవి అలానే కొనసాగుతాయని అభిప్రాయపడ్డారు. 

కృషి మండీలను నిర్వీర్యం చేయడానికి ఈ చట్టాలను తీసుకురాలేదని, వాటిని మరింత బలోపేతం చేసింది తమ ప్రభుత్వమే అన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని అభిప్రాయపడ్డారు ప్రధాని మోడీ. 

ఇకపోతే వ్యవసాయ బిల్లులపై నిన్న ఓటింగ్‌ సందర్భంగా రాజ్యసభలో జరిగిన రచ్చ గురించి అందరికి తెలిసిందే. ఒకరినొకరు దూషించుకోవడం నుండి ప్రతులు చింపడం వరకు నిన్న పెద్దల సభలో జరగని రాద్ధాంతం లేదు. 

పార్లమెంట్‌లో ఆదివారం చోటుచేసుకున్న గందోరగోళంపై రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా హక్కుల మర్యాదలకు భంగం కలిగించే విధంగా విపక్ష సభ్యులు వ్యవహరించారని ఆయన ఫైర్ అయ్యారు. 

రాజ్యసభలో ఘర్షణ పూరిత వాతావరణాన్ని సృష్టించారని, డిప్యూటీ చైర్మన్‌ విధులకు ఆటంకం కలిగించారని సభ్యుల వ్యవహార శైలిపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. 

సభ్యులెవరైనా నిబంధనలు పాటించాల్సిందే అని చెప్పిన వెంకయ్య రచ్చ చేసిన ఎంపీలపై చర్యలు తీసుకున్నారు.  ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు వెంకయ్య నాయుడు. వ్యవసాయ బిల్లు ఆమోదం సందర్భంగా, అధికార పక్షం ప్రవేశపెట్టిన సస్పెన్షన్ తీర్మానానికి కూడా ఆమోదం తెలిపారు. 
సభాసాంప్రదాయాలను సభ్యులు పాటించలేదని, సభామర్యాదను ఉల్లంఘించారని, అందుకుగాను చర్యలు తీసుకుంటూ సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.