భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో ఫణి తుఫాన్ అల్లకల్లోలం సృష్టించిన ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం నాడు  ఏరియల్ సర్వే నిర్వహించారు. ఒడిశా రాష్ట్రానికి సుమారు  వెయ్యి కోట్లను ఇవ్వనున్నట్టుగా మోడీ ప్రకటించారు.

ఒడిశా రాష్ట్రంలో ఫణి తుఫాన్ కారణంగా 12 మంది మృతి చెందారు. 5 వేల గ్రామాలు, 50 పట్టణాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

భారీ వర్షాలకు తోడు గంటకు 200 కి.మీ వేగంతో వీచిన పెనుగాలులతో  తీవ్రంగా ఆస్తి నష్టం వాటిల్లింది. విద్యుత్ స్థంభాలు, సెల్‌పోన్ టవర్లు కూలిపోయాయి.  సోమవారం నాడు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌, గవర్నర్ గణేష్ లాల్‌తో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధానికి అధికారులు తుఫాన్ నష్టం గురించి వివరించారు.

 ఏరియల్ సర్వే అనంతరం మీడియాతో మాట్లాడిన మోదీ.. ఒడిషాను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఒడిషాకు ఇప్పటికే రూ. 381 కోట్లు  సాయం అందిస్తున్నట్లు ప్రకటించామని.. తక్షణసాయంగా మరో వెయ్యి కోట్లిస్తామని మోదీ తెలిపారు. ‘ఫణి’ తుపాన్‌ను ఒడిషా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొందని ప్రధాని చెప్పుకొచ్చారు.
 
ఇదిలా ఉంటే.. తుపాను బాధితులకు గాను ఏపీ ప్రభుత్వం రూ. 15కోట్లు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. విపత్తుల వల్ల కలిగే నష్ట తీవ్రత అపారమని బాధితులను ఆదుకోవడం మానవతా ధర్మంగా ఒడిషా ప్రభుత్వానికి అన్నివిధాలా సాయం అందిస్తామని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.