అక్టోబర్ 24 న గుజరాత్‌లో మూడు ముఖ్యమైన ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. గుజరాత్ రైతుల కోసం ‘కిసాన్ సూర్యోదయ యోజన’, యు.ఎన్. మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌ అనుబంధ పీడియాట్రిక్ హార్ట్ హాస్పిటల్ , అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్‌లో టెలి-కార్డియాలజీ కోసం మొబైల్ అప్లికేషన్‌ను ప్రధాని ప్రారంభిస్తారు. వీటితో పాటు గిర్నార్‌లో రోప్‌వేను ఆయన ప్రారంభిస్తారు. 

కిసాన్ సూర్యోదయ యోజన:

నీటిపారుదల కోసం పగటి పూట విద్యుత్ సరఫరా కోసం విజయ్ రూపానీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వం ఇటీవల ‘కిసాన్ సూర్యోదయ యోజన’ ప్రకటించింది. ఈ పథకం కింద రైతులు ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు విద్యుత్ సరఫరాను పొందగలుగుతారు.

ఈ పథకం కింద మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి 2023 నాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ .3500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 3,490 సర్క్యూట్ కిలోమీటర్ల (సికెఎం) పొడవుతో 234 '66 -కిలోవాట్ 'ట్రాన్స్‌మిషన్ లైన్లు ఏర్పాటు చేస్తారు.

ఇవి 220 కెవి సబ్‌స్టేషన్లకు అదనం. 2020-21 సంవత్సరానికి ఈ పథకం కింద దాహోద్, పటాన్, మహిసాగర్, పంచమహల్, చోటా ఉదేపూర్, ఖేడా, టాపి, వల్సాద్, ఆనంద్ మరియు గిర్-సోమనాథ్లను చేర్చారు. 2022-23 నాటికి దశల వారీగా మిగిలిన జిల్లాలను చేరుస్తారు.

పీడియాట్రిక్ హార్ట్ హాస్పిటల్ :

యు.ఎన్. మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌తో అనుసంధానించబడిన పీడియాట్రిక్ హార్ట్ హాస్పిటల్‌ను, అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్‌లో టెలి-కార్డియాలజీ కోసం మొబైల్ అప్లికేషన్‌ను కూడా ప్రధాని ప్రారంభిస్తారు.

ఈ క్రమంలో యు.ఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఇప్పుడు కార్డియాలజీ విభాగంలో దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రిగా మారుతుంది. అంతేకాకుండా ప్రపంచ స్థాయి వైద్య , మౌలిక సదుపాయాలున్న ప్రపంచంలోని కొన్ని ఎంపిక చేసిన ఆసుపత్రులలో ఇది కూడా ఒకటి.

యు.ఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీలో రూ. 470 కోట్లతో విస్తరణ పనులు చేపట్టారు. దీంతో పడకల సంఖ్య 450 నుండి 1251 కి పెరుగుతుంది. ఈ సంస్థ దేశంలో అతిపెద్ద సింగిల్ సూపర్ స్పెషాలిటీ కార్డియాక్ టీచింగ్ ఇనిస్టిట్యూట్ గా మరియు ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ సూపర్ స్పెషాలిటీ కార్డియాక్ హాస్పిటల్లో ఒకటిగా అవతరిస్తుంది.

భూకంపాలను తట్టుకునే సామర్ధ్యం, ఫైర్ ఫైటింగ్ హైడ్రాంట్ సిస్టమ్ , ఫైర్ మిస్ట్ సిస్టమ్ వంటి భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా పరిశోధనా కేంద్రం, భారతదేశపు మొట్టమొదటి అడ్వాన్స్‌డ్ కార్డియాక్ ఐసీయూ ఆన్ వీల్స్‌, వెంటిలేటర్లు, ఐఏబీపీ, హిమోడయాలసిస్, ఈసీఎంవో మొదలైనవి ఉన్నాయి. 14 ఆపరేషన్ థియేటర్లు, 7 కార్డియాక్ కాథెటరైజేషన్ ల్యాబ్‌ల్ని కూడా ప్రారంభించనున్నారు. 

గిర్నార్ రోప్‌వే:

గిర్నార్‌లో రోప్‌వే ద్వారా గుజరాత్ మరోసారి ప్రపంచ పర్యాటక పటంలో హైలైట్ అవుతుంది. దీనిలో తొలుత 25-30 క్యాబిన్‌లు ఉంటాయి, క్యాబిన్‌కు 8 మంది సామర్థ్యం ఉంటుంది. 2.3 కిలోమీటర్ల దూరాన్ని రోప్‌వే ద్వారా కేవలం 7.5 నిమిషాల్లోనే చేరుకోవచ్చు . దీనితో పాటు గిర్నార్ పర్వతం చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి రమణీయత సందర్శకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది.