ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్‌ మోడీ లక్నో విమానాశ్రయంలో బుధవారం ధర్నాకు దిగారు. మద్దతుదారులను తానున్న స్థలం వద్దకు పోలీసులు అనుమతించలేదని, పోలీసులు వారిని అరెస్టు చేశారన్న ఆరోపణలతో ఆయన ఆందోళన నిర్వహించారు.

అయితే తామెవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో లక్నో ఎయిర్‌పోర్టులో విమానం దిగిన ప్రహ్లాద్‌ తన మద్దతుదారులను అనుమతించలేదంటూ పోలీసులపై మండిపడ్డారు. 

అంతేగాకుండా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారని, కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు వారిని విడుదల చేసేంత వరకు ధర్నాను విరమించేది లేదని ప్రహ్లాద్ స్పష్టం చేశారు.

దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధాని కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని పోలీసులు చెప్పారని ఆయన అన్నారు. అయితే వీటిని పోలీసులు ఖండించారు.

ప్రహ్లాద్‌ మోడీకి సంబంధించిన వారెవరూ అరెస్టయినట్లు తమకు తెలియదని ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే ప్రధాని సోదరుడైన ప్రహ్లాద్‌ పేరును ఫోర్జరీ చేసి జితేంద్ర తివారి అనే ఓ వ్యక్తి సుల్తాన్‌పూర్‌లో అరెస్టయ్యాడని పోలీసులు చెబుతున్నారు.