శాంతిని కోరుకున్నంత మాత్రాన చేతులు కట్టుకుని కూర్చోమని.. ప్రతి పోరాటంలో విజయం మనదేనని ప్రధాని వెల్లడించారు. దేశ భద్రతంతా భారత జవాన్ల చేతిలోనే ఉందన్నారు ప్రధాని మోడీ. భారత్-చైనాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో నరేంద్రమోడీ శుక్రవారం లడఖ్‌లో పర్యటించారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో కలిసి ప్రధాని లేహ్‌లో పర్యటించారు.

సముద్ర మట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో నీమ్‌లో ఆయన ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. లడఖ్‌లో ఆకస్మిక పర్యటనతో ఆయన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా సైనికులను ఉద్ధేశించి ప్రధాని మాట్లాడుతూ.. ఇంత కఠిన పరిస్ధితుల్లోనూ జవాన్లు దేశం కోసం పనిచేస్తున్నారని ప్రశంసించారు.

భారత సైనికుల తెగువ వెలకట్టలేనిదన్న ఆయన భద్రతా బలగాల శౌర్యానికి సెల్యూట్ చెప్పారు. దేశమంతా సైనికుల్ని చూసి స్పూర్తి పొందుతోందని ప్రధాని కొనియాడారు. మీ ధైర్య సాహసాలను దేశం ఎప్పటికీ మరిచిపోదని.. ప్రపంచం మొత్తానికి గట్టి సందేశం ఇచ్చామని మోడీ తెలిపారు.

లడఖ్ నుంచి కార్గిల్ వరకు మీ ధైర్యం అమోఘమని.. భారత శతృవులకు గట్టి గుణపాఠం నేర్పారని ప్రధాని కితాబిచ్చారు. సరిహద్దుల్లో జవాన్ల వల్లే దేశం మొత్తం నిశ్చింతగా ఉందని... అమరులైన సైనికులకు ఆయన మరోసారి నివాళులర్పించారు.

ధైర్యవంతులే శాంతిని కోరుకుంటారని.. శాంతిపై భారత్‌కు ఉన్న నిబద్ధతను ప్రపంచమంతా గమనించిందని ప్రధాని తెలిపారు. జవాన్ల త్యాగం నిరుపమానమైనదని... ఆధునిక సాంకేతికతను, అభివృద్ధిని అందిపుచ్చుకుంటున్నామని మోడీ స్పష్టం చేశారు. 

ఈ భూమి 130 కోట్ల మంది భారతీయులకు ప్రతీక అన్న ప్రధాని.. విచ్ఛిన్న శక్తుల కుట్రలను లడఖ్ ప్రజలు తిప్పికొట్టారని గుర్తుచేశారు. 14 కార్ప్స్‌ సైనికుల పరాక్రమం గురించి దేశం నలుమూలలా మాట్లాడుకుంటున్నారని వెల్లడించారు.

మన సంకల్పం  హిమాలయాల కన్నా ఎత్తయినదన్న ప్రధాని.. వేల సంవత్సరాల  నుంచి ఎన్నో దాడులను మనం తిప్పికొట్టామని మోడీ చెప్పారు. ఇవాళ భారత్ శక్తి సామర్ధ్యాలు అజేయమని.. జల, వాయు, పదాతి, అంతరిక్ష విభాగాల్లో మన శక్తి సమున్నతమన్నారు.