బాలా కోట్ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా పాకిస్తాన్‌ గగనతలాన్ని ఉపయోగించారు. మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని ఫ్రాన్స్, బహ్రయిన్, యూఏఈలలో పర్యటించనున్నారు.

దీనిలో భాగంగా ఆయన పాక్ గగనతలం మీదుగా ఫ్రాన్స్ చేరుకుంటారు. ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్‌తో ఉగ్రవాదం, రక్షణ, ఇతర అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

అనంతరం ఇద్దరు నేతలు సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొంటారు. రాత్రి ఫ్రాన్స్‌కు 60 కిలోమీటర్ల దూరంలోని ఓయిస్‌లో వున్న 19వ శతాబ్ధం నాటి భవనంలో రాత్రి భోజనం చేస్తారు.

శుక్రవారం ఉదయం ఫ్రాన్స్‌లో స్థిరపడ్డ భారతీయులను కలిసి వారితో ముచ్చటించనున్నారు. అనంతరం గతంలో ఎయిరిండియా ప్రమాదంలో మరణించిన వారి జ్ఞాపకార్ధం నిర్మించిన మెమోరియల్‌ను ప్రారంభించనున్నారు.

శనివారం ఫ్రాన్స్ నుంచి యూఏఈ, బహ్రయిన్‌ చేరుకుని అక్కడి నుంచి తిరిగి ఆదివారం పారిస్ చేరుకుని జీ7 దేశాధినేతల సమావేశంలో పాల్గొంటారు.

కాగా.. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన దాడిలో 40 మంది జవాన్ల ప్రాణాలు తీసినందుకు ప్రతీకారంగా భారత వాయుసేన బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడి జరిపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్తాన్ తన గగన తలాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే.