Farmers Protest: రైతులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక ట్వీట్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలోని రైతు సోదర, సోదరీమణులను ప్రస్తావిస్తూ కీలక ట్వీట్ చేశారు. రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రతి సంకల్పాన్ని పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని వివరించారు.
MSP: రైతుల మరోసారి ఆందోళనబాట పట్టిన విషయం తెలిసిందే. పంజాబ్, హర్యానా రాష్ట్రాల సరిహద్దులో శంభు వద్ద తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. ఆరు మాసాలకు సరిపడా గాసాన్ని కూడా వారు వెంట తెచ్చుకున్నారు. కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ, రైతులపై నమోదైన కేసుల ఉపసంహరణ వంటి ఇతర డిమాండ్లతో వారు ధర్నాకు దిగారు. 2020లో రైతులు చేసిన భీకర పోరాటానికి కేంద్రం దిగిరాక తప్పలేదు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారికి క్షమాపణలు చెప్పారు. డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
తాజాగా మరోసారి రైతులు ధర్నాకు దిగారు. న్యాయమైన డిమాండ్లతో వారు మళ్లీ ఆందోళనలు చేస్తున్నారు. రైతు నేతలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు కూడా జరుపుతున్నది. పలు దశలుగా చర్చలు జరిగినా ఏకాభిప్రాయం మాత్రం కుదరలేదు. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక ట్వీట్ చేశారు.
Also Read: YS Sharmila: అరెస్టు చేస్తుండగా గాయపడ్డ వైఎస్ షర్మిల.. తన తండ్రి, తల్లిని పేర్కొంటూ కామెంట్స్
‘దేశవ్యాప్తంగా ఉన్న రైతు సోదరుల సంక్షేమానికి సంబంధించి ప్రతి సంకల్పాన్ని పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఈ నేపథ్యంలోనే చెరుకు కొనుగోలు ధరను చారిత్రాత్మక స్థాయిలో పెంచాం. ఇది కోట్లాది మంది చెరుకు రైతులకు లాభిస్తుంది’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఎఫ్‌ఆర్‌పీని పెంచి ప్రతి క్వింటాల్ చెరుకు ధరను రూ. 340కి పెంచినట్టు పియూశ్ గోయల్ ట్వీట్ చేశారు. ప్రజా ప్రయోజనకరంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ ప్రధాని మోడీ పై ట్వీట్ చేశారు.