మహారాష్ట్ర ఎన్నికల తర్వాత బీజేపీకి శివసేనకు మధ్య అంత సఖ్యత లేదన్న సంగతి తెలిసిందే. నాటి నుంచి ప్రతి అంశంలో కేంద్రంపై సేన ఘాటు విమర్శలు చేస్తోంది. దీనికి కరోనా మరింత ఆజ్యం పోసింది. మహారాష్ట్రకు కేంద్రం నుంచి సాయం అందడం లేదంటూ శివసేన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వస్తోంది. ఇలాంటి పరిస్ధితుల్లో కొద్దిరోజుల కిందట... సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రధాని మోడీతో భేటీ కావడం దేశ రాజకీయాల్లో పెను సంచలనమే రేపుతోంది. తాము వ్యక్తిగత సంబంధాలకు అత్యంత విలువ ఇస్తామని, రాజకీయంగా సంబంధాలను చూడమని  శివసేన తేల్చి చెప్పింది. తాజాగా మోడీ, బీజేపీలపై ఎప్పుడూ ఒంటికాలుతో లేచే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సైతం మోడీ ఆకాశానికెత్తేశారు. ప్రధాని మోడీ దేశంలో టాప్ లీడర్ అని, బీజేపీలో కూడా ఆయనే టాప్ లీడర్ అని ప్రశంసించారు. 

దేశంలో మోడీ ఛరిష్మా తగ్గినట్లేనా? అని మీడియా ఆయనను ప్రశ్నించింది. దీనికి రౌత్ సమాధానమిస్తూ... మీడియాలో వస్తున్న వార్తలను తాను చూడలేదని తెలిపారు. అధికారికంగా కూడా ఎక్కడా ఇలాంటి నిర్ణయం వెలువడలేదన్నారు. గడిచిన 7 సంవత్సరాల్లో బీజేపీ సాధించిన ఘన విజయాల వెనుక మోడీ కృషి ఉందని, బీజేపీలోనే మోడీ టాప్ అని రౌత్ పేర్కొన్నారు.

Also Read:రాజకీయంగానే విడిపోయాం.. మోడీతో అనుబంధం అలాగే వుంది: ఉద్ధవ్ థాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రధాని అన్న హోదా మొత్తం దేశానికి సంబంధించినదని, ఒక పార్టీకి సంబంధించింది కాదని సంజయ్ స్పష్టం చేశారు. ప్రధాని మోడీ తలచుకుంటే శివసేనతో కలిసి పోటీ చేస్తారని ప్రకటించిన బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యలపై రౌత్ ఆసక్తికరంగా స్పందించారు. పులితో (శివసేన గుర్తు) ఎవరూ స్నేహం చేయలేరని.. ఎవరితో స్నేహం చేయాలో పులే నిర్ణయించుకుంటుందని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.