తనను ఈసారి కేబినెట్‌లోకి తీసుకోవద్దంటూ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని మోడీ లేఖ రాశారు. ఈ వార్త బీజేపీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. సీనియర్ నేత కావడంతో ఆయన సేవలు ఉపయోగించుకోవాలనుకుంటున్న మోడీ.. జైట్లీని ఒప్పించేందుకు రంగంలోకి దిగారు.

మరికాసేపట్లో అరుణ్ జైట్లీ నివాసానికి ప్రధాని నరేంద్రమోడీ వెళ్లనున్నారు. కేబినెట్‌లోకి చేరరాదని తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ఆయన్ను ప్రధాని కోరే అవకాశం ఉంది.

తాను మరోసారి కేంద్రమంత్రి వర్గంలో భాగం కాలేనని, తనకు కేబినేట్‌లో చోటు కల్పించవద్దని కోరుతూ.. మోడీకి లేఖ రాశారు. ‘‘ ఐదేళ్ల పాటు మోడీ సారథ్యంలో పని చేసినందుకు సంతోషంగా ఉంది.. ఎన్డీయే ప్రభుత్వంలో నాకు కొన్ని బాధ్యతలు అప్పగించారు.

అయితే గత 18 నెలలుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నానని.. తగినంత విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. అందువల్ల భవిష్యత్తులో తాను కొన్ని బాధ్యతలకు దూరంగా ఉండాలనుకుంటున్నా... నా ఆరోగ్యానికి, చికిత్సకు తగినంత సమయం కావాలి.. కాబట్టి ఎలాంటి మంత్రి పదవి చేపట్టలేను.

ఇది నాకు నేనుగా తీసుకుంటున్న నిర్ణయం.. అనధికారికంగా పార్టీకి, ప్రభుత్వానికి సేవలందిస్తానంటూ జైట్లీ.. మోడీకి లేఖ రాశారు.