న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌ విభజన, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏల రద్దు దేశంలో నెలకొన్న పరిస్థితులపై యావత్ ప్రజలకు తెలియజేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ సిద్ధమయ్యారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించాలని నిర్ణయించారు. జమ్ముకశ్మీర్ పునర్ విభజన ఆవశ్యకతను దేశ ప్రజలకు గురువారం సాయంత్రం మన్ కీ బాత్ కార్యక్రమంలో వివరించనున్నారు. 

జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంపై రాజకీయంగా దుమారం రేపుతోంది. దేశంలోని విపక్షాలు మోదీ సర్కార్ తీరును తప్పుబడుతుంటే శ్రతుదేశాలైన పాకిస్తాన్, చైనాలు కయ్యానికి కాలుదువ్వుతున్నాయి. 

ఈ పరిణామాల నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌ అంశాన్ని యావత్‌ ప్రజలకు తెలియజేసేందుకు ప్రధాని మోదీ గురువారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారని తెలుస్తోంది. ఆర్టికల్ 370ను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది..? జమ్ముకశ్మీర్‌ విభజన వంటి అంశాలపై మోదీ ప్రజలకు వివరణ ఇవ్వనున్నారు.  

నరేంద్రమోదీ ప్రధానిమంత్రి అయిన తర్వాత జాతినుద్దేశించి కీలక ప్రసంగాలు చేసేందుకు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో దేశం గర్వించదగ్గ అంశాలతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆదర్శవంతమైన పాలన నిర్ణయాలను ప్రజలకు వివరించేవారు. 

గత ఐదేళ్లలో చాలా సార్లు మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి 27న మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.  యాంటి-శాటిలైట్‌(ఏశాట్‌) క్షిపణిని భారత్‌ విజయవంతంగా ప్రయోగించిందని, ఈ క్షిపణి ద్వారా కక్ష్యలో తిరుగుతున్న ఓ సజీవ ఉపగ్రహాన్ని కూల్చినట్లు మోదీ ప్రకటించారు. 

అయితే మరో వారం రోజుల్లో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రాబోతుంది. ఆరోజున ప్రధాని నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే దేశంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో గురువారం సాయంత్రం 4 గంటలకు మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ ప్రసంగిచనున్నట్లు సమాచారం.