కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. మన దేశంలోనూ ఈ మహమ్మారి సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ఈ మధ్యే కాస్త  ఈ మహమ్మారి శాంతించింది. కరోనా కేసులో దేశంలో తగ్గుముఖం పడుతున్నాయి. అయితే.. ఈ వైరస్ కి శాశ్వత పరిహారం గా కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది.

తొలి దశలో ఫ్రంట్ వారియర్స్ వైద్యులు, ఆరోగ్య నిపుణులకు అందజేయగా.. నెమ్మదిగా అందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా.. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయన వైద్యుల సహాయంతో కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

అంతేకాకుండా.. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఈ వ్యాక్సిన్ కోసం వైద్యులు, శాస్త్రవెత్తలు ఎంతో శ్రమించి వ్యాక్సిన్ తయారు చేశారని ఆయన పేర్కొన్నారు. అందరూ వ్యాక్సిన్ తీసుకొని దేశాన్ని కరోనా రహిత భారత్ గా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు.

అయితే.. ఆయన ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వెనక చాలా పెద్ద మతలబే ఉన్నట్లు స్పష్టంగా అర్థమౌతోంది. కరోనా తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో వ్యాక్సిన్ కోసం అందరూ ఆశగా ఎదరు చూశారు. అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక మాత్రం.. దానిని తీసుకోవడానికి అయిష్టత ఎక్కువగా వ్యక్తమౌతోంది.

కొందరు వ్యాక్సిన్ తర్వాత వచ్చే  సైడ్ ఎఫెక్ట్స్ కి భయపడుతున్నారు. అంతేకాకుండా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొందరు ప్రాణాలు కోల్పోయారనే వార్తలు కూడా చాలా మందిని భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.  ఈ క్రమంలోనే వ్యాక్సిన్ తీసుకోవడం లేదు. వ్యాక్సిన్ పేరు చెబితేనే భయపడిపోతున్నారు. మాకొద్దు వ్యాక్సిన్ అనే భావన కొందరిలో పడిపోయింది. మరి కొందరికి అసలు వైరస్ అంటే భయం లేకుండా పోయింది. అందుకే.. వ్యాక్సిన్ పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో... వ్యాక్సిన్ వృథా అయిపోతుందనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి.

ఈ క్రమంలోనే దేశంలో తయారైన వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్రమోదీ ఈ రోజు తొలి డోస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏమీ కాదు అనే అభయం ప్రజల్లో పెంచాలనే ఉద్దేశంతో ఆయన ముందుడుగు వేశారు.  ఆయన తీసుకున్నారనే ధైర్యంతో మరికొందరు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

ఇదిలా ఉండగా...వచ్చే ఏడాది జనవరి నాటికి దేశంలో అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముందుగా.. వయసు పైబడిన వారు ముఖ్యంగదా 60ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. దీని కోసం వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.