రాజ్యసభ 250వ సెషన్ జరుపుకుంటున్న సందర్భంగా సభ ప్రత్యేకంగా చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. 250వ సెషన్ జరుపుకుంటున్న రాజ్యసభ సభ్యులకు అభినందనలు తెలియజేశారు.

ఉభయసభలూ చరిత్రను సృష్టించాయని.. ఎన్నో చారిత్రక ఘట్టాలకు రాజ్యసభ సాక్ష్యంగా నిలిచిందన్నారు. డా. బీఆర్. అంబేద్కర్ రాజ్యసభ సభ్యునిగానే పార్లమెంట్‌కు వచ్చారని ప్రధాని గుర్తు చేశారు. కాలంతో పాటు మారేందుకు రాజ్యసభ కృషి చేస్తోందని.. గొప్ప నాయకులు సభకు నేతృత్వం వహించారని మోడీ పేర్కొన్నారు.

1952 మే 13న ఎగువ సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాజ్యసభ చారిత్రక ఘట్టాలను వివరిస్తూ పుస్తకాన్ని విడుదల చేశారు. 67 ఏళ్లలో 5,466 సిట్టింగ్‌లను రాజ్యసభ నిర్వహించింది.

అలాగే ఇప్పటి వరకు 3,817 బిల్లులకు పెద్దల సభ ఆమోదం తెలిపింది. మొత్తం 2,282 మంది రాజ్యసభకు ఎంపికవ్వగా.. వీరిలో 208 మంది మహిళలు, 137 మంది నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. రాజ్యసభ తొలి ఛైర్మన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్.