ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్ పథకం కింద తొమ్మిదో దఫా నిధులను విడుదల చేశారు. 9.75 కోట్ల మంది రైతులు దీనితో ప్రయోజనం పొందుతారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం కిసాన్) తొమ్మిదో విడత డబ్బులను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేశారు. సోమవారం నిర్వహించిన ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ నిధులను ప్రధాని విడుదల చేశారు. సోమవారం మధ్యాహ్నం నుంచే లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అవుతున్నాయి. ఇందులో భాగంగా సుమారు 9.75 కోట్ల రైతుల బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ. 19,500 కోట్లు జమకానున్నాయి.
చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా మద్దతునివ్వడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్‌లో భాగంగా ప్రతి యేటా మూడు దఫాల్లో రూ. 2000 చొప్పున మొత్తం రూ. 6000వేలను నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేస్తున్నది. ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు కేంద్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకే పథకాన్ని ప్రకటించినా ఆసాములకూ విస్తరింపజేసింది. ప్రభుత్వోద్యోగులు, రూ. 10వేల పింఛన్ తీసుకుంటున్న రిటైర్డ్ ఉద్యోగులు సహా పలువురిని పథకం నుంచి మినహాయించింది. పీఎం కిసాన్‌తోపాటు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా నేరుగా రైతులకు నగదును బదిలీ చేస్తున్నది.
ఇలా చెక్ చేసుకోవచ్చు..
ఈ పథకం కింద ఖాతాలో జమ అయిన మొత్తాలను పీఎం కిసాన్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ఉపయోగించి తెలుసుకోవచ్చు. లబ్దిదారులు తమ పేరును ఎంటర్ చేసి నిధులు జమ అయ్యాయో లేదో కనుక్కోవచ్చు. ఏమైనా అవాంతరాలు, సమస్యలుంటే హాట్‌లైన్ నెంబర్లనూ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
