దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మంగళవారం ఉదయం ‘జైహింద్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా దేశ ప్రజలను పలకరిస్తూ అభినందనలు తెలిపారు. 

కొవిడ్-19 మహమ్మారి మధ్య నిర్వహిస్తున్న గణతంత్ర దినోత్సవం ముఖ్య అతిథి లేకుండా తక్కువ మందితో కవాతు సాగింది. కొవిడ్ ప్రోటోకాల్ మధ్య రిపబ్లిక్ డే ఉత్సవాల్లో రాఫెల్ ఫైటర్ జెట్ లు, టి-90 ట్యాంకులు, సామ్ విజయ్ ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్, సుఖోయ్-30 విమానాలు, ఎంకేఐ ఫైటర్ జెట్ లు విన్యాసాలు సాగించేందుకు సిద్ధమయ్యాయి. ఈమేరకు ప్రధాని మోదీ హిందీలో ట్వీట్ చేశారు.

కాగా.. నేషనల్ వార్ మెమోరియల్ వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ అమరవీరులకు నివాళులర్పించారు. మన దేశం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరవీరులకు నరేంద్ర మోదీ నివాళులర్పించారు.

సాధారణంగా రిపబ్లిక్ డే వేడుకలకు విదేశీ నేత విశిష్ట అతిథిగా హాజరవుతారు. కానీ, ఈ ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అతిథి హాజరు కావడం లేదు. విదేశీ అతిథి లేకుండానే భారత్ రిపబ్లిక్ వేడుకలు నిర్వహించడం ఇది నాలుగోసారి మాత్రమే. 1952, 1953 మరియు 1966లలో విదేశీ అతిథి హాజరు కాలేదు.

ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌‌ను ఆహ్వానించగా.. ఆయన రావడానికి అంగీకరించారు. కానీ, యూకేలో కొత్తరకం కరోనా స్ట్రెయిన్ విజృంభించడంతో తన భారత పర్యటనను జాన్సన్ వాయిదా వేసుకున్నారు. రిపబ్లిక్ డే పరేడ్‌ను కరోనా నేపథ్యంలో తొందరగానే ముగించనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలను 11.25 గంటలతో ముగుస్తాయి.