దేశ సరిహద్దుల్లో చైనా కాలు దువ్వుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, త్రివిధ దళాల ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్తతలపై ప్రధాని చర్చించారు. అనంతరం విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌తోనూ మోడీ మాట్లాడారు.

సరిహద్దు భద్రతలపై త్రివిధ దళాల అధిపతులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత మోడీ ఈ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లుగా తెలుస్తోంది.

మే 5న పాంగాంగ్ ప్రాంతంలో భారత్- చైనా దేశాల సైనికులు తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రెండు వైపులా సైనికులు తీవ్ర గాయాల పాలయ్యారు. నాటి నుంచి లడఖ్‌ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.

తిరిగి మే 9న ఉత్తర సిక్కింలోనూ ఇదే తరహా పరిస్ధితులు తలెత్తాయి. తమ గస్తీకి చైనా సైనికులు పదే పదే అడ్డొస్తున్నారని భారత సైన్యం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.