Asianet News TeluguAsianet News Telugu

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియల కోసం జపాన్ వెళ్లిన ప్రధాని మోడీ

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలకు హాజరు కావడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ దేశం వెళ్లారు. రేపు అధికారికంగా ఈ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇదే పర్యటనలో జపాన్ ప్రధాని కిషిదాతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు.
 

pm narendra modi leaves for japan to attend former pm shinzo abe funerals
Author
First Published Sep 26, 2022, 9:14 PM IST

న్యూఢిల్లీ: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు రేపు నిర్వహించే అంత్యక్రియలకు హాజరుకావడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశానికి బయల్దేరి వెళ్లారు. షింజో అబేకు అధికారికంగా నిర్వహించనున్న అంత్యక్రియలకు హాజరు కావడానికి ముందు ప్రధాని మోడీ.. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు. అనంతరం, అకాసక ప్యాలెస్‌లో గ్రీటింగ్ అకేషన్‌లో పాల్గొంటారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీ.. షింజో అబే సతీమణి అకీ అబేను కూడా కలుస్తారు.

ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీ ఓ ట్వీట్ చేశారు. ఈ రోజు రాత్రి జపాన్‌కు వెళ్లబోతున్నట్టు తెలిపారు. జపాన్ మాజీ ప్రధాని, ప్రియ మిత్రుడు, ఇండియా - భారత్ మైత్రిని బలోపేతం చేయడంలో పాలుపంచుకున్న షింజో అబే అంత్యక్రియల్లో పాల్గొనబోతున్నట్టు వివరించారు. షింజో అబే అంత్యక్రియలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు.

జపాన్ ప్రధాని కిషిదా, షింజో అబే సతీమణి అకీ అబేలకు భారతీయుల తరఫున సానుభూతి తెలియజేస్తున్నట్టు ట్వీట్ చేశారు. షింజో అబే కలలు కన్నట్టుగానే ఇండియా జపాన్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో నిమగ్నం అవుతామని వివరించారు.

జపాన్‌కు దీర్ఘకాలం ప్రధానమంత్రిగా సేవలు అందించిన షింజో అబే జులై 8వ తేదీన ఎన్నికల క్యాంపెయిన్‌లో హత్యకు గురయ్యారు. పశ్చిమ జపాన్‌లో ఈ హత్య జరిగింది. షింజో అబే హంతకుడు (41) పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. జులై 9వ తేదీన భారత్ సంతాప దినంగా పాటించింది.

ఈ అంత్యక్రియలకు ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు చెందిన ప్రతినిధులు వస్తున్నారు. కనీసం 20 దేశాల అధినేతలు రాబోతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios