పార్లమెంట్ భవనంలో ప్రధాని మోడీ శుక్రవారం హైలెవల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయెల్, ప్రహ్లాద్ జోషీ, ప్రకాశ్ జవదేవకర్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

పార్లమెంట్‌లో వ్యవసాయ చట్టాలపై రగడ కొనసాగుతోంది. ఇక విపక్షాలు మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.  ఈ క్రమంలో సోమవారం రాజ్యసభలో ప్రధాని మోడీ వ్యవసాయ చట్టాలపై ప్రసంగించనున్నారు.

విపక్షాల ఆరోపణలకు కౌంటరివ్వనున్నారు. అందుకోసమే ఈ హైలెవల్ సమావేశం ఏర్పాటు చేశారు మోడీ. రైతులతో చర్చల సారాంశం, అలాగే వారి డిమాండ్లపై వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు రేపు రైతులు చక్కా జామ్‌కు పిలుపునివ్వడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. 

సాగు చట్టాలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. రాజ్యసభలో వ్యవసాయ చట్టాలపై చర్చ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇటు ప్రతిపక్షాలు, అటు రైతు సంఘాలు.. సాగు చట్టాల్లో ఒక్క లోపాన్నీ ఎత్తి చూపలేకపోయాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వ్యవసాయానికి నీళ్లు కావాలని ప్రతి ఒక్కరికీ తెలుసునని.. ఆ వ్యవసాయాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందని తోమర్ ఎద్దేవా చేశారు. కానీ బీజేపీ ఎప్పుడూ అలా చేయదని ఆయన స్పష్టం చేశారు. సాగు చట్టాలను సమర్థించారు.

ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సదా సిద్ధంగానే ఉందని తోమర్ తేల్చి చెప్పారు. చట్టాల్లో సవరణలు చేసేందుకూ సిద్ధమేనని, అలాగని ఆ మూడు చట్టాల్లో లోపాలున్నట్టు కాదని ఆయన వ్యాఖ్యానించారు.

కేవలం ఒక రాష్ట్రానికి చెందిన రైతులే ఆందోళనలు చేస్తున్నారని, వారికి కావాలనే తప్పుడు సమాచారమిచ్చి రెచ్చగొడుతున్నారని తోమర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.