2030 నాటికి భారతదేశ జనాభా చైనాను మించిపోతుందని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో దేశంలో విపరీతంగా పెరుగుతున్న జనాభాను నియంత్రించాలని అనేక అధ్యయనాలు, సర్వేలు ప్రతిరోజూ వెలువడుతూనే ఉన్నాయి.

కానీ ప్రభుత్వాలు మాత్రం జనాభా నియంత్రణను పట్టించుకోలేదు. అయితే ఇందిరా గాంధీ హయాంలో ఆమె తనయుడు సంజయ్ గాంధీ జనాభా విస్ఫోటనం గురించి ఆలోచించారు. వెంటనే రంగంలోకి దిగి.. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు.

దీనిపై అప్పట్లో పెద్ద దుమారం రేగడంతో పాటు.. విమర్శలు రేగాయి. అప్పటి నుంచి ఏ కేంద్రప్రభుత్వం కూడా జనాభా నియంత్రణ గురించి పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోడీ  జనాభా నియంత్రణ గురించి  ప్రస్తావించారు. దేశ జనాభా విపరీతంగా పెరుగుతోందని... ఇది భవిష్యత్ తరాలను సంక్షోభంలోకి నెడుతుందని మోడీ వ్యాఖ్యానించారు.

ఎర్రకోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగిస్తూ... బిడ్డ పుట్టక ముందే వారి గురించి బాగా ఆలోచించాలని, నాకు పుట్టబోయే బిడ్డకు నేను న్యాయం చేయగలనా అనే ఆలోచన వచ్చినప్పుడు కుటుంబాన్ని పరిమితం చేసుకుంటారన్నారు.

విద్యావంతులైన తల్లిదండ్రులు అలాగే ఆలోచిస్తారని.. ఈ విషయాన్ని బాగా అర్ధం చేసుకునే ప్రజలు ఈ దేశంలో ఉన్నారని అంగీకరించాలన్నారు.