ఎన్నికల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తుండటంపై స్పందించారు ప్రధాని నరేంద్రమోడీ. బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో ప్రసంగించిన ప్రధాని ఈవీఎంల అంశంపై విపక్షాలకు చురకలంటించారు.

రెండోసారి అధికారం ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి తమకు ఎక్కువ సీట్లు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. ఓటమిని జీర్ణించుకోలేని కొందరు విపక్షనేతలు.. ఓటర్లను నిందిస్తున్నారని.. ఇది మంచిపద్దతి కాదని ప్రధాని సూచించారు.

అహంకారానికి కూడా ఓ హద్దుంటుందని..  ఓటర్లను తక్కువ చేసి చూడటం తగదన్నారు. రాహుల్ ఓడినంత మాత్రన ప్రజాస్వామ్యం ఓడినట్లుకాదని.. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజాస్వామ్యానికి చెడ్డ పేరు వస్తుందని...మీడియా సహకారంతో తాము ఎన్నికల్లో గెలవలేదని ప్రధాని స్పష్టం చేశారు.

ఓటమికి ఈవీఎంలను సాకుగా చూపడం విపక్షాలకు ఓ రోగంగా మారిందని.. లోక్‌సభలో ఇద్దరు ఎంపీలున్నప్పుడు కూడా తాము హుందాగా ప్రవర్తించామని మోడీ గుర్తు చేశారు. ఎన్నికల సంస్కరణలు దేశానికి అత్యవసరమని ప్రధాని తెలిపారు.

ఒకే దేశం-ఒకే ఎన్నికల విధానం ఉండాలని కాంగ్రెస్ కావాలనే జమిలి ఎన్నికలపై కాలయాపన చేస్తోందని మోడీ చురకలంటించారు. ఆధార్‌పై ముందు కోర్టుకెళ్లారని.. తర్వాత జీఎస్టీని వ్యతిరేకించారని... ఇప్పుడు ఈవీఎంలపై రాద్ధాంతం చేస్తున్నారని  మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈవీఎంలను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని కానీ ఇప్పుడు వారే ఈవీఎంలపై రాద్దాంతం చేస్తున్నారని.. ఎన్నికల విధానంలో ఒడిశాను దేశ ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని సూచించారు.