ప్రపంచానికి భారతదేశం అందించిన అపూర్వ కానుక యోగా అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జార్ఖండ్ రాజధాని రాంచీలోని ప్రభాత్ తారా మైదానంలో జరిగిన యోగా డే వేడుకల్లో మోడీ పాల్గొన్నారు.

దాదాపు 40 వేల మంది యోగా అభ్యాసకులతో కలిసి ప్రధాని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి దేశం యోగాను తమ జీవితంలో భాగం చేసుకుంటున్నాయని.. దీని వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, అనుభూతి కలుగుతుందన్నారు.  

ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ద్వారా మెరుగైన సేవలు అందిస్తామని మోడీ తెలిపారు. యోగా అనేది ప్రాచీన, ఆధునిక ఆరోగ్య సాధనమని.. రోగాలు దరిచేరకుండా యోగా దోహదపడుతుందన్నారు.

పురాతన పద్ధతులకు ఆధునిక ఫలితాలు జోడించి క్రమశిక్షణ, అంకిత భావంతో యోగా పాటిస్తే అద్భుత ఫలితాలు వస్తామని ప్రధాని సూచించారు. మనదేశంలో రెండు దశాబ్ధాలుగా హృద్రోగ సమస్య పెరుగుతోందని.. వ్యాధులకు చికిత్సకంటే.. ముందుస్తు నివారణ ముఖ్యమని మోడీ అభిప్రాయపడ్డారు.

యోగాకు వయస్సు, రంగు, కులం, మతం తేడా లేదని.. యోగా అందరిదన్నారు. యోగా భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన భాగమని ప్రధాని కొనియాడారు.