దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో రేపు పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచార సభను ప్రధాని నరేంద్రమోడీ రద్దు చేసుకున్నారు. తాను ర్యాలీలో పాల్గొనబోనని ప్రధాని ప్రకటించారు. దీనికి బదులుగా దేశంలో కరోనా తీవ్రతరం కావడంపై ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొంటానని మోడీ గురువారం ట్వీట్ చేశారు.

బెంగాల్‌లో ఇప్పటికే ఆరు దశల ఎన్నికలకు పోలింగ్‌ ముగిసింది. మరో రెండు దశలకు జరగాల్సి ఉంది. అయితే కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని పలు కీలక సమీక్షలు నిర్వహించనున్నారు. కాగా, ఆయన బెంగాల్‌ పర్యటనను రద్దు చేసుకోవడం ఇదే ప్రథమం.

మరోపక్క ఈ రోజు ఆక్సిజన్ సరఫరాపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రధాని మోడీ . ఆక్సిజన్ సరఫరా, ఉత్పత్తి తదితర అంశాలపై కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చించిన మోడీ.. ఆక్సిజన్ అక్రమ నిల్వలపై రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు .

Also Read:కరోనా కేసుల రికార్డ్.. ఒక్క రోజులో 3.16లక్షల మందికి పాజిటివ్

చాలా రాష్ట్రాల నుంచి ప్రాణవాయువు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పత్తి ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రధాని ఆదేశించారు. కాగా.. గడిచిన 24గంటల్లో ఈ మహమ్మారి కారణంగా దేశంలో 2,102 మంది ప్రాణాలు కోల్పోయారు.

తాజా రిపోర్టు ప్రకారం.. బుధవారం 3,15,925 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు మూడు లక్షల మార్క్ చేరకోవడం తో అందరూ ఆందోళన చెందుతున్నారు. ఇలా మూడు లక్షల కేసులు అమెరికాలో జనవరిలో నమోదు కాగా.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు ఆ పరిస్థితి భారత్ లో చోటుచేసుకోవడం గమనార్హం.