బీజేపీని ఆ నాలుగు కులాలే గెలిపించాయి.. విజయోత్సవ సంబరాల్లో ప్రధాని మోడీ వ్యాఖ్యలు
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడంతో పాటు తెలంగాణలోనూ మెరుగైన ఫలితాలను సాధించడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. నారీ శక్తి, యువ శక్తి, కిసాన్ ఔర్ గరీబ్ పరివార్ అనే నాలుగు కులాలే ముఖ్యమని తాను నమ్ముతానని ప్రధాని తెలిపారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడంతో పాటు తెలంగాణలోనూ మెరుగైన ఫలితాలను సాధించడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. నేటి విజయం చారిత్రాత్మకమైనది, అపూర్వమైనదని.. 'సబ్కా సాత్, సబ్కా వికాస్' ఆలోచన గెలిచిందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. నిజాయితీ, పారదర్శకత, సుపరిపాలన కారణంగానే ఈ విజయం దక్కిందన్నారు.
బీజేపీపై ప్రేమ చూపినందుకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రజలకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే తెలంగాణలోనూ పార్టీకి మద్ధతు లభించిందని మోడీ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కులాల వారీగా దేశాన్ని విభజించే ప్రయత్నాలు జరిగాయని.. నారీ శక్తి, యువ శక్తి, కిసాన్ ఔర్ గరీబ్ పరివార్ అనే నాలుగు కులాలే ముఖ్యమని తాను నమ్ముతానని ప్రధాని తెలిపారు. ఈ నాలుగు కులాల ప్రజలు బీజేపీ పట్ల ఉత్సాహాన్ని ప్రదర్శించారని, తాను గెలిచినట్లుగా ప్రతి పేదవాడు భావిస్తున్నారని మోడీ అన్నారు.
మహిళలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ 100 శాతం నెరవేరుస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ తీర్పు ఒక హెచ్చరిక లాంటిదని, దేశాన్ని బలహీనపరిచే రాజకీయాలు చేయొద్దని ప్రధాని హెచ్చరించారు. దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని , జీఎస్టీ వసూళ్లు రికార్డులు సృష్టిస్తున్నాయని ఆయన తెలిపారు.
మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం.. 2024 విజయానికి బాటలు వేసిందన్నారు. ఏ ప్రభుత్వం కావాలనే విషయంలో దేశ ప్రజలు పరిపక్వతతో వున్నారని, అన్ని రకాలుగా ఆలోచించి ఓటేస్తున్నారని మోడీ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వాల కార్యక్రమాలను ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారని .. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ మాకు గ్యారెంటీ వుందని ప్రధాని చెప్పారు. తెలంగాణ తమ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారని, ప్రతి ఎన్నికల్లోనూ బలపడుతున్నామని మోడీ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎప్పుడూ పనిచేస్తామని ప్రధాని తెలిపారు.