21వ శతాబ్ధం జ్ఞాన కేంద్రమని, అందరూ నేర్చుకోవడం, పరిశోధించడం, ఆవిష్కరించడంపైనే దృష్టి సారించాల్సిన అవసరం వుందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. శనివారం ‘‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్-2020’ ఫినాలే కార్యక్రమంలో భాగంగా మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్ధులనుద్దేశించి ప్రసంగించారు.

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగానే మన విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చే లక్ష్యంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చినట్లు ప్రధాని స్పష్టం చేశారు. ఉద్యోగాలను అన్వేషించేవారు కాకుండా.. ఉద్యోగాలను సృష్టించే వారిగా యువతను తీర్చిదిద్దడమే దీని లక్ష్యమని వెల్లడించారు.

యువత ఎప్పుడు చదవడం, ప్రశ్నించడం, సమస్యను పరిష్కరించడంపైనే దృష్టి పెట్టాలని మోడీ సూచించారు. నేర్చుకున్నప్పుడే ప్రశ్నించే జ్ఞానం అలవరుతుందని ఆయన తెలిపారు.

బరువైన బ్యాగులకు స్వస్తి చెప్పి జీవితానికి సాయపడే విద్యను అందించడమే నూతన విద్యా విధానం ముఖ్యోద్దేశమని ప్రధాని చెప్పారు. దేశంలో భాష అనేది సున్నితమైన అంశమని, నూతన విద్యా విధానంలో స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా అవి కూడా అభివృద్ధి చెందుతాయని నరేంద్రమోడీ ఆకాంక్షించారు.

ప్రపంచ దేశాలకు భారతీయులు సేవలందిస్తున్నందుకు దేశ ప్రజానీకమంతా గర్వపడాలని ప్రధాని వ్యాఖ్యానించారు. జీడీపీ ఆధారంగా ప్రపంచంలోని టాప్ 20 దేశాల జాబితాను పరిశీలిస్తే, చాలా దేశాలు తమ మాతృ భాషలో విద్యను అందిస్తున్నాయని మోడీ తెలిపారు.