ప్రధాని నరేంద్రమోడీ మాతృమూర్తి హీరాబెన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు.
ప్రధాని నరేంద్రమోడీ మాతృమూర్తి హీరాబెన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘‘ఈ రోజు మా అమ్మ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. మీ చుట్టూ ఉన్న అర్హులైన వారు కూడా టీకా వేయించుకునేలా వారిని ప్రోత్సహించాలని కోరుతున్నా’’ అని మోడీ ట్వీట్ చేశారు.
అయితే హీరాబెన్ ఏ టీకా వేయించుకున్నారు, ఎక్కడ తీసుకున్నారన్న విషయాన్ని మాత్రం ప్రధాని వెల్లడించలేదు. 99 ఏళ్ల హీరాబెన్ ప్రస్తుతం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తన చిన్నకుమారుడు పంకజ్ మోడీ వద్ద ఉంటున్నారు.
కాగా, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కొవాగ్జిన్‌లను అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది.
తొలి విడతలో ఆరోగ్య కార్యకర్తలు, సాయుధ దళాలు, ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ ఇచ్చారు. మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 45-59 ఏళ్ల మధ్య వయసున్న దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు టీకాలు ఇస్తున్నారు.
రెండో విడత సందర్భంగా మార్చి 1న ప్రధాని మోడీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. తర్వాత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మందికి పైగా టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
