Asianet News TeluguAsianet News Telugu

భోపాల్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రారంభించిన ప్రధాని మోడీ.. ఇది 11వ వందే భారత్‌

మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీకి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. భోపాల్ నగరంలోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌లో ఆయన ఈ ట్రైన్ సేవలను ప్రారంభించారు. భారత రైల్వే రంగాన్ని సంస్కరించాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని ప్రధాని మోడీ అన్నారు.
 

pm modiji flagged off vande bharat express train from bhopal to delhi kms
Author
First Published Apr 1, 2023, 6:18 PM IST

భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి దేశ రాజధాని ఢిల్లీని అనుసంధానిస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. భోపాల్ నగరంలోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోడీ ఈ ట్రైన్‌ సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, మధ్యప్రదేశ్ గవర్నర్ మంగు భాయ్ పటేల్, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌లు పాల్గొన్నారు. భారత రైల్వే నెట్‌వర్క్‌లోకి చేరిన 11వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇది.

భారత రైల్వే సెక్టార్‌ను సంస్కరించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోడీ ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ అన్నారు. పౌరులకు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తామని వివరించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను ప్రారంభించిన తర్వాత ప్రధాని మోడీ అందులో ప్రయాణించారు. అందులో విద్యార్థులతో ముచ్చటించారు. ట్రైన్ స్టాఫ్‌తోనూ ఆయన మాట్లాడారు. 

రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ వన్ పై వందే భారత్ ట్రైన్‌ను ప్రారంభించగా.. ప్లాట్‌ఫామ్ టూ పై ప్రజలు పెద్ద మొత్తంలో గుమిగూడారు. శనివారం మినహా ప్రతి రోజూ ఈ ట్రైన్ సేవలు అందిస్తుంది.

రాణి కమలాపతి స్టేషన్ నుంచి ఉదయం 5.40 గంటలకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఢిల్లీకి బయల్దేరుతుంది. ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ స్టేషన్‌కు మధ్యాహ్నం 1.10 గంటలకు రీచ్ అవుతుంది.  అలాగే, మధ్యాహ్నం 2.40 గంటలకు ఢిల్లీ నుంచి భోపాల్‌కు ప్రయాణం మొదలు పెడుతుంది.

ఈ ట్రైన్ గ్వాలియర్, ఆగ్రా స్టేషన్‌లలో ఆగుతుంది. 

ఈ ఏడాది చివరిలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.

Follow Us:
Download App:
  • android
  • ios