న్యూఢిల్లీ: ఫార్మా కంపెనీలపై ప్రధాని మోడీ షాకింగ్ కామెంట్స్ చేశారు. వైద్యులను లోబరుచుకోవడానికి తమ మందులకు ప్రిస్క్రిప్షన్ రాయించుకోవడానికి ఫార్మా కంపెనీలు యువతులను, విదేశీ యాత్రలను, ఖరీదైన గాడ్జెట్స్ ను ఎర వేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆ విధమైన చర్యలను మానుకుని విలువలను పాటించాలని ఆయన సూచించారు. జైడస్ కాడిలా, టోరెంట్ ఫార్మాస్యూటికల్స్, వోక్ హార్ట్, అపోలో సహా పలు మందుల తయారీ కంపెనీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. 

సాథీ అనే ఓ ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో) నివేదిక బయటకు వచ్చిన తర్వాత ఫార్మా కంపెనీలతో పీఎంవో సమావేశం ఏర్పాటు చేసింది. మార్కెటింగ్ లో నీతిని, విలువలను పాటించాలని ఆయన చెప్పారు. లేదంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని, మరింత కఠినమైన చట్టాలు చేస్తామని ప్రధాని చెప్పారు. 

కాగా, ఫార్మా కంపెనీల దుస్సంప్రదాయాలను అరికట్టడానికి చట్టులను, నిబంధనలను రూపొందించాలని ఇప్పటికే రసాయనాలు, ఎరువులు, వైద్య ఆరోగ్య శాఖలను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కార్యదర్శి డీపీ వాఘేలా, ఐడీఎంఏ, ఐపిఎ, ఓపిపిఐ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.