ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రేపు వర్చువల్‌గా భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఉక్రెయిన్, రష్యా చుట్టూ ఉన్న అంశాలనూ స్పృశించనున్నారు. వీటికితోడు ఇండో పసిఫిక్ రీజియన్‌లోని సమస్యలనూ చర్చించనున్నట్టు తెలిసింది.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌లు రేపు వర్చువల్‌గా సమావేశం కాబోతున్నారు. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించనున్నారు. దక్షిణ ఆసియాలోని ఇండో పసిఫిక్ రీజియన్‌లో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పరిణామాలు, అలాగే, పరస్పర ప్రయోజనాలు ఉన్న అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు. అంతర్జాతీయంగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరువైపులా ఉన్నతస్థాయిలో సంప్రదింపులకు, రెగ్యులర్‌గా చర్చలు జరపడంపై నిర్ణయాలు తీసుకోబోతున్నారు.

ఈ సమావేశంలో ఉక్రెయిన్, రష్యా అంశాలూ ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా ఉన్మాద యుద్ధ పరిణామాలపై జో బైడెన్ చర్చించనున్నట్టు వైట్ హౌజ్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి తెలిపారు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార సరుకుల మార్కెట్, గ్లోబల్ ఫుడ్ సప్లైపైనా మాట్లాడే అవకాశం ఉన్నదని వివరించారు.

ఇటీవలే యూఎస్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దలీప్ సింగ్ భారత పర్యటనలో హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై హెచ్చిరించారు. ఆ తర్వాత వైట్ హౌజ్ వాటిపై వివరణ ఇచ్చింది. ఆయన నిర్మాణాత్మక చర్చలు జరిపారని, ఆయనది వార్నింగ్ కాదని స్పష్టత ఇచ్చింది.

భారత్‌కు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. రష్యాపై తాము విధించిన ఆంక్షలు పక్కదారి పట్టేలా వ్యవహరించవద్దని స్పష్టం చేసింది. రష్యా, చైనాల మధ్య పరిమితి లేని భాగస్వామ్యం ఉన్నదని తెలిపింది. భవిష్యత్‌లో చైనా మళ్లీ భారత భూభాగాల్లోకి చొచ్చుకురావాలని ప్రయత్నించకపోదు అని, అలా ఎల్ఏసీ దాటే ప్రయత్నం చేసినప్పుడు భారత్‌కు సహాయం చేయడానికి, అండగా నిలవడానికి రష్యా ముందుకు రాదని పేర్కొంది. ఎందుకంటే ఆ రెండు దేశాల మధ్య అంతులేని భాగస్వామ్యం ఉందని అవి ప్రకటించుకున్నాయని గుర్తు చేసింది. కాబట్టి, రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలను తప్పించేలా భారత్ వ్యవహరించరాదని పేర్కొంది. ఒక వేళ తాము రష్యాపై విధించిన ఆంక్షలను నీరుగార్చేలా ఏ దేశం వ్యవహరించిన అందుకు తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దలీప్ సింగ్ భారత్‌‌కు బుధవారం వచ్చిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న రష్యాను ఖండించకుండా తటస్థ వైఖరి అవలంభిస్తున్న భారత్‌పై పశ్చిమ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో ఆయన మన దేశంలో రెండు రోజుల పర్యటన చేపట్టారు.

అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో చమురు, ఇతర నిత్యావసర సరుకులను అత్యల్ప ధరలకే ఎగుమతి చేయడానికి రష్యా దాని మిత్రదేశాలకు ఆఫర్లు ఇచ్చింది. భారత్‌కు చమురును చౌకగా అందిస్తామని ప్రకటించింది. దీనికి భారత ప్రభుత్వం కూడా సూచనప్రాయంగా అంగీకరించింది. ఈ అంగీకారం అమెరికా ప్రభుత్వానికి గిట్టడం లేదు. భారత్ అంగీకారం తాము విధించిన ఆంక్షలను ఉల్లంఘించడం లేదని, కానీ, ఆ నిర్ణయం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని సమర్థించినట్టుగా ఉన్నదని పేర్కొంది.

అమెరికా డిప్యూటీ ఎన్ఎస్ఏ దలీప్ సింగ్ ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, రష్యా కరెన్సీ రూబుల్ ఆధారిత మెకానిజం అభివృద్ధి చెందడం లేదా డాలర్ ఆధారిత ఫైనాన్షియల్ సిస్టమ్ దిగజారడం, లేదా రష్యాపై అమెరికా విధించి ఆంక్షలు పక్కదారి పట్టేలా చేయడం వంటి వాటిని అమెరికా సహించదని స్పష్టం చేశారు. అదే సందర్భంలో రష్యా నుంచి భారత ఎగుమతులు ఏకకాలంలో పెరగడాన్ని కూడా అంగీకరిందచని వివరించారు. చమురు దిగుమతులు, అమెరికా నిషేధించిన ఇతర సరుకులను భారత్ ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకోరాదని తెలిపారు.