రాజకీయాల్లోకి లక్షమంది యువతను తీసుకువస్తా... ఎందుకో తెలుసా? : ప్రధాని మోదీ

ప్రధాని మోడీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజకీయాల గురించి ఆయన ఆసక్తికర కామెంట్స్ చేసారు. 

 

PM Modi Unveils 6700 Crore Development Projects in Varanasi AKP

వారణాసి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో రూ.6700 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాశీ అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని ప్రధాని అన్నారు. ఈ రూ.6700 కోట్ల ప్రాజెక్టుల్లో విమానాశ్రయం, విద్య, ఆరోగ్యం, క్రీడలు, పర్యాటక రంగాలకు సంబంధించిన అభివృద్ధి పనులు ఉన్నాయని ఆయన తెలిపారు.

ఎక్స్‌ప్రెస్‌వేలు, విమానాశ్రయాల రాష్ట్రంగా యూపీ

యూపీ అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ఆయన బృందాన్ని ప్రధాని మోదీ అభినందించారు. గతంలో గుంతలమయమైన రోడ్లతో యూపీ విమర్శలు ఎదుర్కొనేదని... ఇప్పుడు ఎక్స్‌ప్రెస్‌వేల రాష్ట్రంగా గుర్తింపు పొందిందని మోడీ అన్నారు. యూపీలో అత్యధిక అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయని, జేవర్‌లో మరో అద్భుతమైన అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలోనే సిద్ధం కానుందని చెప్పారు. యోగి నేతృత్వంలో యూపీలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, యూపీ పెట్టుబడులు, ఉపాధికి కేంద్రంగా మారుతోందని మోదీ ప్రశంసించారు.

యూపీతో పాటు బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలోని వివిధ విమానాశ్రయాలను ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్నాయని తెలిపారు. వీటిలో బాబత్‌పూర్‌తో పాటు ఆగ్రా, సహారన్‌పూర్‌ కూడా ఉన్నాయని ప్రధాని తెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల ఆయా రాష్ట్రాల్లో కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని ఆయన అన్నారు.

పదేళ్ల కిందట యూపీ ఎలా వుండేదంటే :

దేశ ప్రజలు తనకు మూడోసారి సేవ చేసే అవకాశం ఇచ్చినప్పుడు, మూడు రెట్ల వేగంతో పనిచేస్తానని హామీ ఇచ్చానని ప్రధాని గుర్తుచేశారు. ఇంకా 125 రోజులే అయిందని, ఈలోగానే kp.15 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. "10 ఏళ్ల కిందట ప్రభుత్వ కుంభకోణాలే వార్తలుగా ఉండేవి. ఇప్పుడు దేశాభివృద్ధి వార్తలే ప్రతి ఇంట్లో చర్చనీయాంశం అవుతున్నాయి" అని ఆయన అన్నారు.

 ప్రజల డబ్బును ప్రజల కోసమే ఖర్చు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, పూర్తి నిజాయితీతో దీన్ని చేయడం తమ ప్రాధాన్యమని ప్రధాని స్పష్టం చేశారు. గత 10 ఏళ్లలో దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి జరిగిందని ఆయన అన్నారు. హైవేలు, రైల్వే ట్రాక్‌లు, వంతెనల వంటి ప్రాజెక్టుల వల్ల ప్రజలకు సౌకర్యం కలుగుతోందని, కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు.

లక్ష మంది కొత్త యువతను రాజకీయాల్లోకి

యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలనే తన సంకల్పాన్ని ప్రధాని మోడీ వ్యక్తం చేశారు. రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని లక్ష మంది కొత్త యువతను రాజకీయాల్లోకి తీసుకువస్తానని చెప్పారు. కుటుంబ పాలన వారి నుంచి యువత అప్రమత్తంగా ఉండాలని, వారు దేశానికీ, యువతకూ హాని చేస్తారని హెచ్చరించారు.

 మహిళలు, యువత సాధికారత పొందినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోడీ అన్నారు. ముద్రా రుణాల వంటి పథకాల ద్వారా మహిళలకు వ్యాపారం చేసుకునేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తోందని తెలిపారు. గ్రామాల్లో మహిళలు లక్షాధికారి దీదీలుగా, డ్రోన్‌ పైలట్లుగా ఎదుగుతున్నారని చెప్పారు.

కాశీలో అన్నపూర్ణాదేవి స్వయంగా శివుడికి భిక్ష పెడుతుందని, అందుకే ఇక్కడ స్త్రీ శక్తికి గౌరవం, సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని ప్రధాని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన లబ్ధి పొందని వారణాసి మహిళలకు కూడా ప్రయోజనం చేకూర్చేలా మరో 3 కోట్ల కొత్త ఇళ్లు నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఉచిత విద్యుత్‌ పథకం గురించి కూడా ప్రస్తావిస్తూ, దాని వల్ల మహిళల జీవితాలు మరింత సులభతరం అవుతాయని చెప్పారు.

మోడల్‌ సిటీగా వారణాసి

వారణాసిలోని సారనాథ్‌ అభివృద్ధికి సంబంధించిన కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. "సారనాథ్‌కు పాలి, ప్రాకృత భాషలతో లోతైన సంబంధం ఉంది. వాటికి శాస్త్రీయ భాషల హోదా కల్పించడం మనందరికీ గర్వకారణం" అని ప్రధాని అన్నారు. కాశీ అభివృద్ధికి నిరంతరం కృషి జరుగుతోందని, నగరాభివృద్ధికి మోడల్‌ సిటీగా వారణాసి ఎదుగుతోందని చెప్పారు. బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన మాలవీయ వంతెన పక్కనే గంగా నదిపై నిర్మించనున్న డబుల్‌ డెక్కర్‌ వంతెన గురించి ప్రస్తావిస్తూ, దాని వల్ల వారణాసి, చందౌలీ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు.

క్రీడలు, పర్యాటకం, విద్యకు కొత్త కేంద్రం

వారణాసిలో క్రీడలు, విద్యారంగాల్లోనూ కొత్త ప్రాజెక్టులను ప్రారంభించారు. కాశీ క్రీడలకు కేంద్రంగా మారుతోందని ప్రధాని అన్నారు. సిగ్రా స్టేడియంలో ఒలింపిక్స్‌, జాతీయ స్థాయి పోటీలకు క్రీడాకారులు శిక్షణ తీసుకుంటారని చెప్పారు. గంజారి స్టేడియం, అందమైన వీధులు, శుభ్రమైన ఘాట్‌లు కాశీకి కొత్త గుర్తింపు తెచ్చాయని అన్నారు.

 కాశీ అభివృద్ధికి ఎందుకు దూరంగా ఉందో ప్రధాని ప్రశ్నించారు. కుటుంబ పాలన, కుల రాజకీయాలపై విమర్శలు గుప్పిస్తూ 10 ఏళ్ల కిందట వరకూ వారణాసి అభివృద్ధికి నోచుకోలేదని, యూపీ, ఢిల్లీలో అధికారంలో ఉన్నవారే దీన్ని అభివృద్ధికి దూరం చేశారని ఆరోపించారు. "మన ప్రభుత్వం 'సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌' నినాదంతో ముందుకెళ్తోంది. పథకాల్లో ఎలాంటి వివక్ష చూపించడం లేదు" అని ప్రధాని స్పష్టం చేశారు. కాశీ మళ్లీ దేశానికి ఊపునిస్తోందని మోడీ అన్నారు. వారణాసిలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఈ నగరానికే కాకుండా, దేశాభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.

ఇంటికి వచ్చే అవకాశం దక్కింది

భోజ్‌పురిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని, వారణాసిని, దేశాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనే తన సంకల్పాన్ని మళ్లీ స్పష్టం చేశారు. "ఇంటికి వచ్చే అవకాశం దక్కింది. నేడు చైత్‌గంజ్‌లో నఖటయ్యా జాతర కూడా ఉంది. ధంతేరాస్‌, దీపావళి, ఛత్‌ పూజ పండుగలు వస్తున్నాయి. నేడు కాశీ అభివృద్ధి పండుగకు సాక్ష్యంగా నిలుస్తోంది. మీ అందరికీ శుభాకాంక్షలు" అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌, వర్చువల్‌ విధానంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు బ్రజేష్‌ పాఠక్‌, కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

వారణాసికి ₹3,200 కోట్లు

ప్రధాని మోడీ  వారణాసి నుంచి దేశానికి ₹6,700 కోట్ల విలువైన 23 అభివృద్ధి ప్రాజెక్టులను అందించారు. ఈ సందర్భంగా వారణాసిలో ₹3,200 కోట్లకు పైగా విలువైన 16 ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ప్రాజెక్టులు నగరంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు, కొత్త ఉపాధి అవకాశాలు కల్పించి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయి.

వారణాసిలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణకు సంబంధించి కూడా ప్రధాని కీలక ప్రకటన చేశారు. దాదాపు ₹2,870 కోట్లతో విమానాశ్రయ రన్‌వే విస్తరణ, కొత్త టెర్మినల్‌ భవన నిర్మాణం, ఇతర పనులకు శంకుస్థాపన చేశారు. దీని వల్ల విమానాశ్రయ సామర్థ్యం, సౌకర్యాలు పెరుగుతాయి. పర్యాటకులకు, వ్యాపారులకు వారణాసి, పూర్వాంచల్‌ అనుసంధానం మెరుగై, అభివృద్ధికి దోహదపడుతుంది.

మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు

ఇక క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ₹219 కోట్లతో వారణాసి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ రెండు, మూడు దశల ప్రారంభోత్సవం . నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌, క్రీడాకారులు, కోచ్‌లకు వసతి గృహం, క్రికెట్‌, ఫుట్‌బాల్‌ మైదానాలు, షూటింగ్‌ రేంజ్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్టేడియంలో 100 పడకల వసతి గృహంతో పాటు పెవిలియన్‌ నిర్మాణం. ₹4 కోట్లతో భరతారా, చిరాయ్‌గావ్‌లలో ఆరోగ్య కేంద్రాల ప్రారంభోత్సవం. 20 పార్కుల అభివృద్ధి, కొత్త పార్కుల నిర్మాణం.

సారనాథ్‌లో ₹90 కోట్లతో అభివృద్ధి పనులు. గురుధామ్‌, బాణాసుర దేవాలయాల అభివృద్ధి. ₹2 కోట్లతో టౌన్‌హాల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం. ₹7 కోట్లతో ఐటీఐలో హైటెక్‌ ల్యాబ్‌. ₹14 కోట్లతో సిపెట్‌లో వసతి గృహం. ₹6 కోట్లతో కరసడలో ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ పనులు. కకర్‌మతలో ₹1 కోటితో ప్లే యాక్టివిటీ జోన్‌. సెంట్రల్‌ జైల్లో ₹11 కోట్లతో జైలు బ్యారక్‌లు. ₹4 కోట్లతో కస్తూర్బా గాంధీలో విద్యా భవనం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios