UP Election 2022: ఉత్తప్రదేశ్ లో ఎన్నికల హడావిడి మాములుగా లేదు. ఈ క్రమంలోనే ఓ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ గా మారింది. ఆ వీడియో వైరల్ కావడానికి ప్రధాన కారణం ప్రధాని మోడీ ఓ బీజేపీ నేత కాళ్లు మొక్కడమే..!
UP Assembly Election 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికే పలు దశల ఎన్నికలు పూర్తయిన క్రమంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతుండటంతో రాజకీయాలు కాక రేపుతున్నాయి. రాష్ట్రం (Uttar Pradesh) లో మళ్లీ అధికారం దక్కించుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తుండగా, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ సైతం తనదైన స్టైల్ లో ప్రచారం కొనసాగిస్తూ.. అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తోంది.
బీజేపీ నుంచి అగ్ర నాయకులందరూ ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీకి సంబంధించి ప్రస్తుతం ఓ వీడియో వైరల్ గా మారింది. ప్రధాని మోడీ ఓ బీజేపీ కార్యకర్త కాళ్లకు మొక్కుతున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. దీంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. వివరాల్లోకెళ్తే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉన్నావ్‌లో బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరుకాగా, స్టేజ్‌పైకి వచ్చిన ప్రధానికి అందరూ ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఉన్నావ్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అవదేశ్ కటియార్ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధాని మోడీకి అందజేశారు. అనంతరం మోడీ కాళ్లను మొక్కేందుకు వంగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వెంటనే ప్రధాని మోడీ ఆయనను ఆపారు.
ప్రధాని మోడీ తన కాళ్లకు నమస్కరించొద్దని చెప్పిన అనంతరం.. తిరిగి ఉన్నావో జిల్లా అధ్యక్షుని కాళ్లకు మోడీ మొక్కిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. ఏకంగా స్టేజీమీద ప్రధాని మోడీ బీజేపీ నేత కాళ్లు మొక్కడం అందర్నీ షాక్ గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేశ ప్రధాని ఇలా ఈ చిన్న నేత కాళ్లు మొక్కడంపై.. ఇది మోడీ గొప్పతనానికి నిదర్శనం అంటూ పలువురు పేర్కొంటున్నారు. కాగా, గతంలోనూ కార్యకర్తలు కాళ్లు మొక్కి నమస్కరిస్తే.. తిరిగి మోడీ వాళ్ల కాళ్లు మొక్కిన సందర్భాలూ ఉన్నాయి. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. ఇప్పటికే వేల లైక్ లను సంపాదించింది. కాగా, అవధేష్ కటియార్‌ను సెప్టెంబరు 2021లో BJP ఉన్నావ్ జిల్లా అధ్యక్షుడిగా నియమించింది. దీనికి ముందు, అతను ఉన్నావ్‌లో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. UP ఎన్నికలు 2022కి సంబంధించిన మూడో దశ పోలింగ్ జరిగిన ఆదివారం నాడు ఈ సంఘటన చోటుచేసుకుంది.
యూపీలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు (UP Assembly Election 2022) జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా, ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుత అసెంబ్లీల గడువు మార్చి 14తో ముగుస్తుంది. ఇప్పటికే మూడు దశల ఎన్నికలకు పోలింగ్ ముగిసింది.
