ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెలలో అమెరికా పర్యటించనున్నారు. ఈ నెల 22న ఆయన వాషింగ్టన్ డీసిలో అడుగుపెట్టనున్నారు. ఈ పర్యటనలో ఆయన అమెరికా దిగ్గజ కంపెనీల చీఫ్‌లతో వరుస భేటీల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగానే యాపిల్ చీఫ్ టిమ్ కుక్ కూడా ఉన్నట్టు తెలిసింది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తోనూ ప్రధాని మోడీ భేటీ కాబోతున్నట్టు సమాచారం. క్వాడ్ దేశాధినేతలతో భేటీ కావడంతోపాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించనున్నారు.

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ఈ మహమ్మారి బారి నుంచి కోలుకోవడానికి, ఇతర వాణిజ్య, భద్రతపరమైన అంశాలపై వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి దేశాధినేతల సమావేశాలు మెల్లగా ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికాకు పర్యటిస్తున్నారు. ఈ నెల 22న వాషింగ్టన్ డీసీకి ప్రధాని మోడీ వెళ్తున్నారు. అక్కడే వెంటవెంటనే ఉన్నస్థాయి సమావేశాల్లో పలువురు కీలక నేతలతో భేటీ కానున్నారు.

ఈ పర్యటనలో అమెరికాలోని టాప్ కంపెనీల సీఈవోలతో ప్రధాని మోడీ సమావేశమవనున్నారు. ఇందులో భాగంగా యాపిల్ చీఫ్ టిమ్ కుక్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం కాబోతున్నట్టు తెలుస్తున్నది. అయితే, దీనిపై అధికారిక ధ్రువీకరణ ఇంకా రాలేదు. కానీ, వీరిరువురి భేటీ కోసం వర్కవుట్ జరుగుతున్నదని తెలిసింది. వెంటవెంటనే అమెరికా దిగ్గజ కంపెనీల చీఫ్‌లతో భేటీ తర్వాత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో సమావేశం కానున్నారు. భారత మూలాలున్న కమలా హ్యారిస్ సాధారణ స్థాయి నుంచి అమెరికా టాప్ 2 ర్యాంకుకు చేరిన సంగతి తెలిసిందే. వీరి భేటీ పైనా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నది.

అదే రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపనీస్ పీఎం యోషిహిదే సుగాలతో సమావేశం కాబోతున్నారు.

ఇదే పర్యటనలో ఆయన తొలిసారిగా అమెరికా అధక్షుడు జో బైడెన్‌తో ప్రత్యక్షంగా భేటీ కాబోతున్నారు. వీరిరువరూ ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడనున్నారు. తర్వాత క్వాడ్ సమ్మిట్ కూడా జరగనుంది. ఈ నెల 24న క్వాడ్ నేతలు ప్రత్యక్షంగా భేటీ కాబోతున్నారు. క్వాడ్ దేశాల్లో అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌లున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి అమెరికా పర్యటనలో ఓ డిన్నర్‌నూ ప్లాన్ చేసినట్టు తెలిసింది. 

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటిస్తున్న సందర్భంలోనే యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఇదే దేశంలో పర్యటించనున్నారు. అంతేకాదు, వీరిరువురూ అమెరికాలో సమావేశమయ్యే అవకాశమున్నట్టు తెలిసింది. 24వ తేదీ సాయంత్రం ఆయన న్యూయార్క్ వెళ్లనున్నారు. తర్వాతి రోజే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు.