శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు పట్టిన గతే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పడుతుందని టీఎంసీ ఎమ్మెల్యే అన్నారు. కోల్‌కతాలోని ఓ మెట్రో ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం మమతా బెనర్జీని ఆహ్వానించలేదు. ఈ తరుణంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇద్రిస్ అలీ ప్రధాని నరేంద్ర మోడీపై అభ్యంతరక వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు పట్టిన గతే ప్రధాని మోడీకి కూడా పడుతుందని అన్నారు. రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఆందోళనకారులు అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టారు. నిరసనకారుల రాకకు ముందే ఆయన భవనం వదిలి పారిపోయారు.

కోల్‌కతాలోని సీల్దా మెట్రో స్టేషన్ ప్రారంభ కార్యక్రమానికి సీఎం మమతా బెనర్జీని కేంద్రం ఆహ్వానించలేదు. ఈ వేడుక జులై 11వ తేదీన జరగనుంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి మమతా బెనర్జీని ఆహ్వానించలేదు. ఈ తరుణంలో టీఎంసీ ఎమ్మెల్యే ఇద్రి అలీస్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మమతా బెనర్జీని ఆహ్వానించకపోవడం అన్యాయం అని ఎమ్మెల్యే ఇద్రిస్ అలీ అన్నారు. ఆమె రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు ప్రారంభమైందని వివరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క ప్రతినిధిని కూడా ఆహ్వానించకపోవడం దారుణమైన విషయం అని అన్నారు.

ఇటీవలే విక్టోరియా మెమోరియల్‌లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్న కార్యక్రమానికి సీఎం మమతా బెనర్జీకి ఆహ్వానం అందలేదు. దీనిపైనా టీఎంసీ స్పందించింది. కేంద్ర ప్రభుత్వం విభజన రాజకీయాలు చేస్తున్నదని ఫైర్ అయింది. కాగా, ఈ సంప్రదాయాన్ని టీఎంసీనే ప్రారంభించిందని బీజేపీ తిప్పికొడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆహ్వానించడం లేదని పేర్కొంది.