న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం నాడు సాయంత్రం ఆరు గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. తన ప్రసంగం వినాలని ఆయన ప్రజలను కోరారు.

ఇవాళ ప్రధాని మోడీ ఏ విషయమై స్పందిస్తారో ఇంకా స్పష్టత రాలేదు. కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో అన్‌లాక్ 5.0 అమల్లో ఉంది. అన్ లాక్ 5.0 అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రధాని ప్రజలతో మాట్లాడనున్నారు.

కరోనా వైరస్ కేసులు దేశంలో నమోదౌతున్నప్పటి నుండి పలు సందర్భాల్లో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్కులను విధిగా ధరించాలని ఆయన ప్రజలను కోరుతున్నారు.దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోడీ ఏ విషయాల గురించి ప్రస్తావిస్తారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

దేశంలో కరోనా కేసులు మంగళవారం నాటికి 75 లక్షల 97  వేల 063కి చేరుకొన్నాయి. కరోనాతో 1,15, 197 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనాతో 587 మంది మరణించారు.