న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్ విషయమై దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం నాడు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. లాక్ డౌన్ విషయమై కేంద్రం రేపు స్పష్టత ఇవ్వనుంది.

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ ను పొడిగించాలని మెజారిటీ రాష్ట్రాలు ప్రధాని మోడీని కోరాయి. ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు..

ఈ వీడియో కాన్పరెన్స్ లో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలను స్పష్టం చేశారు.  ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాయి.తెలంగాణ, ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, బెంగాల్  ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పొడిగించాయి. మిగిలిన రాష్ట్రాలు కూడ లాక్ డౌన్ ను పొడిగించాలని కూడ ప్రధానిని కోరిన విషయం తెలిసిందే.

మరో వైపు కరోనా వైరస్ ను వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా మూడు జోన్లుగా దేశాన్ని విభజించాలని కేంద్రం భావిస్తోంది.లాక్ డౌన్  తో పాటు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఏం చేయాలనే దానిపై ప్రధానమంత్రి మోడీ సోమవారం నాడు పలువురు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.లాక్ డౌన్ విషయమై మోడీ మంగళవారం నాడు కీలక ప్రకటన చేయనున్నారు.